విజయవాడ: తమిళనాడులో పట్టుబడిన రూ.5.22 కోట్లపై టీడీపీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి డబ్బుపై ఆశ ఎక్కువ అని, దాని కోసం ఆయన అనేక సూట్ కేసు కంపెనీలు పెట్టి అడ్డంగా బుక్కయ్యారని ఆయన అన్నారు. 

జగన్ 11 కేసుల్లో 43 వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. తమిళనాడులో జగన్ కు చెందిన కంపెనీలతో మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డికి సంబంధం ఉందని, బాలినేని తరచూ డబ్బును అక్కడికి తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు. డబ్బు పట్టుబడిన కారులో మంత్రి అనుచరులు ఉన్నారని చెప్పారు. 

పట్టుబడిన డబ్బు బాలినేనిదేనని అనుచరలు చెప్పారని ఆయన అన్నారు. డబ్బుతో , వాహనంపై ఉన్న స్టిక్కర్ తో తనకు సంబంధం లేదని బాలినేని చెప్పడం సరికాదని చినరాజప్ప అన్నారు. ఆ డబ్బు తన వ్యాపారానికి సంబంధించిందని బాలినేని అనుచరుడు నల్లమెల్లి బాలు స్వయంగా చెప్పారని ఆయన గుర్తు చేశారు. 

వీరంతా తరచూ హవాలా రూపంలో డబ్బు చెన్నైకి తరలిస్తున్నారని,    జగన్ ముఖ్య అనుచరుడు కాబట్టే బాలినేనిని ఈ కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. కేసును పూర్తి స్థాయిలో విచారణ చేయడమే కాకుండా ఏపీ కేబినెట్ నుంచి బాలినేని శ్రీనివాస రెడ్డిని బర్తరఫ్ చేయాలని చినరాజప్ప డిమాండ్ చేశారు.