కర్నూలు: రాయలసీమ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చాయి యూనివర్శిటీ విద్యార్థి సంఘాలు. 

విద్యార్థి సంఘాల పిలుపులో భాగంగా సీఎం జగన్ ఇంటి ముట్టడికి బయల్దేరుతున్న విద్యార్థులను యూనివర్సిటీలోనే పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులకు, విద్యార్థులకు వాగ్వాదం చోటు చేసుకుంది. 

పోలీసులు విద్యార్థులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. దాంతో ఇరువురి మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. వ్యతిరేకంగా నినాదాలు చేశాయి.  

జై రాయలసీమ నినాదంతో రాయలసీమ యూనివర్శిటీ హోరెత్తిపోయింది. రాయలసీమలో రాజధాని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని రాయలసీమ యూనివర్శిటీకి చెందిన విద్యార్థులు కొన్ని రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

1937 నవంబర్ 16 న జరిగిన శ్రీభాగ్ ఒడంబడికను వెంటనే అమలు చేయాలని ముఖ్యమంత్రిని కోరేందుకు తాము బయలుదేరితే పోలీసులు తమను అడ్డుకున్నారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. రాజధాని, హైకోర్టు రెండింటిని కర్నూలులో ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.