ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు.

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఎర్రగొండపాలెంలోని ఇజ్రాయెల్‌పేటలో ఆర్చి నిర్మాణంపై ఇరు వర్గాల మధ్య వివాదం కొనసాగుతుంది. ఓ వర్గం వారు ఆర్చి నిర్మాణానికి సిద్దమవ్వగా.. మరో వర్గం వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ వివాదం నేపథ్యంలో గత కొద్ది రోజులుగా అక్కడ పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆదివారం రాత్రి ఒక్కసారిగా ఆర్చి వివాదంలో ఇరువర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. అయితే దీనిని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. అయితే ఈ రాళ్ల దాడిలో ఓ కానిస్టేబుల్‌తో సహా పలువురికి గాయాలయ్యాయి. గాయపడినవారిలో మహిళలు కూడా ఉన్నారు. వారిని ఆస్పత్రులకు తరలించారు. 

ఆర్చి నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన పిల్లర్ బాక్సులు ధ్వంసం కావడంతో ఎర్రగొండపాలెంలోని ఇజ్రాయెల్‌పేటలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే అధికారులు ఎర్రగొండపాలెంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరకుండా చర్యలు చేపట్టారు. ఆదివారం రాత్రి రాళ్ల దాడికి కారణమైన ఇరువర్గాలకు చెందినవారిపై పోలీసులు నాన్ బెయిలెబుల్ కేసులు నమోదు చేశారు.