పసలపూడిలో ఉద్రిక్తత: పోలీసులతో అమరావతి రైతుల వాగ్వాదం,తోపులాట
అమరావతి రైతుల పాదయాత్ర పసలపూడికి చేరుకున్న సమయంలో ట్రాపిక్ కు అంతరాయం కల్గిస్తున్నారని పోలీసులు యాత్రను అడ్డుకున్నారు. గుర్తింపు కార్డులు చూపాలని పోలీసులు కోరారు. పోలీసులతో అమరావతి రైతులు వాగ్వాదానికి దిగారు.
అమలాపురం:అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పసలపూడి వద్ద అమరావతి రైతుల పాదయాత్ర చేరుకున్న సమయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ట్రాఫిక్ కు అంతరాయం కల్గిస్తున్నారని పోలీసులు పాదయాత్ర ను అడ్డుకున్నారు. అంతేకాదు పాదయాత్రలో పాల్గొంటున్నవారి గుర్తింపు కార్డులను కూడ చూపాలని కోరారు. ఇవాళ పసలపూడిలో రైతులు పాదయాత్ర చేస్తున్న సమయంలో పోలీసులు యాత్రను అడ్డుకున్నారు.దీంతో పోలీసులతో అమరావతి పరిరక్షణ జేఏసీ ప్రతినిధులు వాగ్వావాదానికి దిగారు. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది.దీంతో ఓ మహిళ కిందపడి గాయపడింది. పోలీసుల తీరును నిరసిస్తూ పాదయాత్రికులు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు.
2019 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశాన్నితెరమీదికి తెచ్చింది. 2014లో అమరావతిలో రాజధానికి వైసీపీ సమ్మతించిన విషయాన్ని విపక్షాలు గుర్తు చేస్తున్నాయి. మూడు రాజధానులను విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతున్నారు
మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకు విపక్షాలు మద్దతు ఇస్తున్నాయి. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ అమరావతి రైతులు అమరావతి నుండి అరసవెల్లి వరకు పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో సాగుతుంది .
అయితే మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ రౌండ్ టేబుల్స్ నిర్వహించింది. మూడు రాజధానులకు మద్దతుగా జేఏసీ ఏర్పాటైంది. జేఏసీ నిర్వహించిన విశాఖ గర్జనకు వైసీపీ మద్దతును ప్రకటించింది. మూడు రాజధానులకు మద్దతుగా పలు కార్యక్రమాలను నిర్వహించాలని వైసీపీ నిర్వహిస్తుంది.