అద్దంకి: ప్రకాశం జిల్లాలోని అద్దంకిలో వైసీపీ నేతలు పోటా పోటీగా ఫ్లైక్సీలు ఏర్పాటు చేశారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, ఆయన తనయుడు వెంకటేష్ ఫ్లైక్సీలను తొలగించడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు.

చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం పుట్టిన రోజును పురస్కరించుకొని బలరాంతో పాటు ఆయన తనయుడు వెంకటేష్ ఫోటోలు ఉన్న ఫ్లైక్సీలను అద్దంకిలో కరణం బలరాం అనుచరులు ఏర్పాటు చేశారు.

మరో వైపు వైసీపీ అద్దంకి ఇంచార్జీగా కృష్ణ చైతన్య నియామకం పూర్తై ఏడాది పూర్తి చేసుకొన్న సందర్భంగా ఆయన అనుచరులు కూడ పట్టణంలో ఫ్లైక్సీలు ఏర్పాటు చేశారు. అయితే అనుమతి లేదని కరణం బలరాం, వెంకటేష్ ఫ్లైక్సీలను అద్దంకి మున్సిపల్ అధికారులు తొలగించారు. 

అయితే కృష్ణ చైతన్యకు చెందిన ఫ్లైక్సీలను అలానే ఉంచారు. దీంతో కరణం వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.