ఇరు వర్గాలు మీడియా పాయింట్ వద్ద మాట్లాడే అవకాశం తమకంటే కాదు తమకంటూ వాగ్వాదానికి దిగారు.
ప్రతిపక్షం అసెంబ్లీలో ఏం మాట్లాడినా టిడిపి మాత్రం ఎదురుదాడినే అస్త్రంగా చేసుకుని తప్పించుకుంటోంది. శాంతిభద్రతలు సమస్య కావచ్చు, గనుల అక్రమ తవ్వకాలు కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అవినీతి కవచ్చు. ఇలా అంశమేదైనా సరే వైసీపీ ఆరోపణలు చేయటం, టిడిపి ఎదురుదాడి చేయట మామూలైపోయింది. తమ హయాంలో అవినీతి జరగటం లేదని, శాంతిభద్రతలు సవ్యంగా ఉన్నాయని చెప్పలేకపోతోంది. టిడిపి హయాంలో అవినీతి పెరిగిపోయిందని, శాంతి భద్రతలు క్షీణించాయని వైసీపీ అనగానే దివంగత సిఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఏం జరిగందంటూ టిడిపి ఎదురుదాడి చేయటం గమనార్హం.
తాజాగా సభలో అదే జరిగింది. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదంటూ వైసీపీ ఎంఎల్ఏ గిడ్డి ఈశ్వరి తదితరులు మీడియాపాయింట్ వద్ద మాట్లాడుతున్నారు. అదే సమయంలో తామే ముందు వచ్చాం కాబట్టి తామే ముందు మాట్లాడుతామంటూ టిడిపి ఎంఎల్ఏ అనిత తదితరులు మీడియాపాయింట్ వేదిక మీదకు ఎక్కటంతో సమస్య మొదలైంది.
సభలో శాంతిభద్రతలు, బాక్సైట్ తవ్వకాలు తదితరాలపై చర్చ జరుగుతున్నపుడు గందరగోళం మొదలైంది. శాంతి భద్రతలపై సభలో చర్చ జరుగుతున్నపుడు ఈశ్వరి సిఎం తల నరుకుతానని గతంలో అన్నట్లు టిడిపి ఎంఎల్ఏ అనిత ఆరోపణలు చేసారు. అయితే, తాను ఆ మాటలను అనలేదని, అన్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఈశ్వరి సవాలు విసిరారు. దాంతో ఇరివురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో ఇరు వర్గాలు మీడియా పాయింట్ వద్ద మాట్లాడే అవకాశం తమకంటే కాదు తమకంటూ వాగ్వాదానికి దిగారు.
దాంతో పెద్ద ఎత్తున తోపులాటలు జరిగింది. చివరకు ఏమనుకున్నారో ఏమో అనిత తదితరులు వెళ్ళిపోయారు. అయితే వెంటనే మంత్రి పీతల సుజాత తదితరులు మళ్ళీ మీడియా పాయింట్ వద్దకు చేరుకున్నారు. చేరుకోవటమే గిడ్డి తదితరులను నెట్టేసారు. దాంతో మళ్ళీ తోపులాటలు మొదలయ్యాయి. దాంతో మాడియా పాయింట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. చివరకు పోలీసులు రంగంలోకి దిగి వైసీపీ ఎంఎల్ఏలను అక్కడి నుండి వెళ్లిపోమంటూ ఒత్తిడి తెచ్చారు. దాంతో వైసీపీ ఎంఎల్ఏలు అటు టిడిపి ఎంఎల్ఏలతోను ఇటు పోలీసులతోను పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వచ్చింది.
