తమను మంత్రివర్గం నుండి తప్పిస్తే పార్టీకి గుడ్ బై చెబుతామంటూ మధ్యవర్తుల ద్వారా సదరు మంత్రులు చంద్రబాబుకు హెచ్చరికలు పంపుతున్నట్లు పార్టీలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

మంత్రివర్గ ప్రక్షాళనతో చంద్రబాబునాయుడుకు కొత్త తలనొప్పులు తప్పేట్లు లేవు. ఒకవైపు ఫిరాయింపు ఎంఎల్ఏలు, మరోవైపు తొలగింపు తప్పదని ప్రచారంలో ఉన్న మంత్రుల నుండి చంద్రబాబుకు హెచ్చరికలు అందుతుండటమే కారణం. మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఫిరాయింపులు, తప్పిస్తే ఒప్పుకోమంటూ వేటు పడుతుందనుకుంటున్నమంత్రులు చంద్రబాబుపై మానసికంగా ఒత్తిడి పెడుతున్నట్లు పార్టీలో ప్రచారం ఊపందుకున్నది. మంత్రివర్గం నుండి తప్పిస్తే ఒక తలనొప్పి, ఉంచుచుంటే ఇంకో తలనొప్పి తప్పేట్లు లేదు.

తీయాలనుకున్న వారిని తీయలేక, వారితో పనిచేయించుకోలేక, ఫిరాయింపులను మంత్రివర్గంలోకి తీసుకోవటం ఇష్టంలేక ఏం చేయాలో చంద్రబాబుకు అర్ధం కావటం లేదని సమాచారం. తమను మంత్రివర్గం నుండి తప్పిస్తే పార్టీకి గుడ్ బై చెబుతామంటూ మధ్యవర్తుల ద్వారా సదరు మంత్రులు చంద్రబాబుకు హెచ్చరికలు పంపుతున్నట్లు పార్టీలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. గుంటూరు, కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమకు చెందిన మంత్రులు హెచ్చరికలు పంపుతున్నవారిలో ఉన్నారని టిడిపి నేతలు అనుకుంటున్నారు. ఇప్పటికే వీరంతా జగన్ తో టచ్ లో ఉన్నట్లు కూడా సమాచారం. అదే విషయాన్ని చంద్రబాబు కూడా ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం తెప్పించుకున్నారట.

వివిధ కారణాల వల్ల మంత్రుల్లో ఎవరిని కూడా చంద్రబాబు నియంత్రిచే పరిస్ధితి లేదన్నది వాస్తవం. ఏదో మీడియా కోసమని, పార్టీ నేతల ముందు వారిపై హూంకరించటమే కానీ నిజంగా వారిపై చర్యలు తీసుకునే సాహసం చంద్రబాబు చేయలేకపోతున్నారు. అవినీతి, పనితీరు ఆధారంగా మంత్రివర్గం నుండి తప్పించాల్సి వస్తే కనీసం 10 మంది మంత్రులను ఎప్పుడో తప్పించాల్సింది. కానీ చంద్రబాబు ఆ పనిచేయలేదు. కారణం రాజకీయ, ప్రాంతీయ, సామాజికవర్గ సమీకరణలే.

మంత్రివర్గ ప్రక్షాళన ఎప్పుడు చేసినా ఈ తలనొప్పులు తప్పవు. అందుకే ఇంతకాలం అందరినీ ఊరిస్తూ నెట్టుకొస్తున్నారు. కానీ ఇపుడు కొడుకు లోకేష్ కోసం ప్రక్షాళన తప్పటం లేదు. టిడిపి అంతర్గత రాజకీయాలను ‘ప్రక్షాళన ప్రకంపనలు’ ఏం మలుపు తిప్పుతాయో చూడాలి. పైగా టిడిపి ఆగష్టు నెల కూడా అచ్చిరాలేదనే సెంటిమెంట్ ఉండనే ఉంది కదా.