Asianet News TeluguAsianet News Telugu

వైసిపి ఎంపిల దీక్ష: చంద్రబాబుకు కొత్త ఫిట్టింగ్

ఎంపిల రాజీనామాలకు సంబంధించి జగన్ చేసిన తాజా ప్రకటన చంద్రబాబుతో పాటు టిడిపిలో కూడా ఆందోళన రేపుతోంది.
Tension mounting in naidu over jagans latest statement

చంద్రబాబునాయుడుకు వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కొత్త ఫిట్టింగ్ పెట్టారు. ఎంపిల రాజీనామాలకు సంబంధించి జగన్ చేసిన తాజా ప్రకటన చంద్రబాబుతో పాటు టిడిపిలో కూడా ఆందోళన రేపుతోంది. పార్లమెంటు సమావేశాల చివరి రోజున ఎంపిలందరూ రాజీనామాలు చేస్తారని జగన్ చెప్పటం వరకూ బాగానే ఉంది.

అయితే, తర్వాత చేసిన ప్రకటనేతో టిడిపిలో కలకలం మొదలైంది. రాజీనామాలు చేసిన ఎంపిలు ఆమరణ దీక్షలు చేస్తారంటూ జగన్ ప్రకటించారు. అదికూడా ఏపి భవన్లో. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎంపిలు చేయనున్న ఆమరణ దీక్షకు ఏపి భవన్నే ఎందుకు ఎంచుకున్నట్లు?

ఏ పార్లమెంటు భవన వద్దనో లేకపోతే జంతర్ మంతర్ వద్దో ఎంపిలు తమ దీక్షను చేయవచ్చు కదా? ప్రత్యేకించి ఏపి భవన్లోనే ఆమరణ దీక్ష చేస్తారని జగన్ ప్రకటన వెనుక పెద్ద వ్యూహమే దాగుంది.

ఏపి భవన్ అన్నది ప్రభుత్వానికి సంబంధించినది. అందులో నిరసనలు, ఆందోళనలు చేసేందుకు లేదు. అటువంటిది ఏకంగా ఆమరణ దీక్ష చేస్తామంటే జరిగేపనికాదు. ఎంపిల దీక్షకు చంద్రబాబు ఒప్పుకునే అవకాశం లేదు. నిజంగానే సిఎం ఒప్పుకోకపోతే రాష్ట్రంలో చంద్రబాబుపై వ్యతిరేకత పెరిగిపోతోంది.

ఎందుకంటే, ప్రత్యేకహోదా కోసం ఎంపిలు చేస్తున్న ఆమరణదీక్షను అడ్డుకుంటారా? అంటూ జనాలు మండిపోతారు. ఒకవేళ వైసిపిల దీక్షకు గనుక అనుమతిస్తే వారితో పాటు టిడిపి ఎంపిలు దీక్షలో ఎందుకు కూర్చోవటం లేదంటూ జనాలు నిలదీస్తారు. పై రెండింటిలో ఏది జరిగినా చంద్రబాబుకు ఇబ్బందే. ఎందుకంటే, రానున్నది ఎన్నికల కాలం కాబట్టే. మొత్తానికి జగన్ పెట్టిన కొత్త ఫిట్టింగ్ తో చంద్రబాబులో టెన్షన్ మొదలైందన్నది వాస్తవం.

Follow Us:
Download App:
  • android
  • ios