విజయనగరం: తెలంగాణలో ముందస్తు ఎన్నికలంటూ రాజకీయ ప్రచారం జోరుగా సాగుతుంది. అందుకు అధికార పార్టీ పావులు చకచకా కదుపుతుంది. అటు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ సైతం యుద్దానికి తాము సిద్ధమేనంటూ సవాల్ కు ప్రతిసవాల్ విసురుతోంది. ఏపీలో ముందస్తు ఎన్నికలు లేకపోయినప్పటికి రాబోయే ఎన్నికల్లో బెర్త్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ నెలకొంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు గ్రేడింగ్ లంటూ నానా హంగామా చేస్తుండటంతో వచ్చే ఎన్నికల్లో సీటు తమకొస్తుందా అంటూ సిట్టింగ్ ఎమ్మెల్యేలు తెగ టెన్షన్ పడుతున్నారు. 

నాలుగేళ్ల పాలనలో అనుకూల ప్రతికూల అంశాలతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు నానా పాట్లు పడుతున్నారు. అనుకూల పరిస్థితి ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు భవిష్యత్ తమదేనని ధీమాగా ఉంటే, ప్రతికూల పరిస్థితి ఎదుర్కొంటున్నఎమ్మెల్యేలు మాత్రం తమ రాజకీయ భవితవ్యంపై ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్యేలుగా తాము ఉండగా పార్టీలో కొందరు సీనియర్లు రంగంప్రవేశం చేయడం ద్వితీయ శ్రేణి నాయకులు దూసుకెళ్లి పోవడంతో తమకు సీటు దక్కుతుందా అంటూ మదనపడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాబోయే ఎన్నికల్లో తమ బెర్త్‌పై టెన్షన్‌తో రగిలిపోతున్నారు.  

విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఉత్తరాంధ్రలోనే అత్యధిక స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్న జిల్లా. తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు..ఒక ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. అంతేకాదు వైసీపీకి చెందిన ఎమ్మెల్యేను సైతం ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో తమపార్టీలోకి తీసుకుని అసెంబ్లీ స్థానాల సంఖ్యను ఏడుకు పెంచుకుంది. 

కేంద్రప్రభుత్వంలో ఒక మంత్రి పదవి, రాష్ట్రమంత్రి వర్గంలో ఒక మంత్రి పదవిని దక్కించుకుంది విజయనగరం జిల్లా. తెలుగుదేశం పార్టీకి అండదండగా ఉన్న జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలు ఎదురీదుతున్నారు. రాబోయే ఎన్నికల్లో తన భవితవ్యంపై ఆందోళన చెందుతున్నారు. ఒకరు మినహా మిగిలిన ఎమ్మెల్యేలంతా ప్రజా తిరస్కారం ఎదుర్కొంటున్నారన్న ప్రచారం లేకపోలేదు. ఎస్ కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఒక్కరే జెట్ స్పీడుతో దూసుకుపోతున్నారు. కోళ్ల లలితకుమారి తర్వాత స్థానంలో నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామి నాయుడు ఉన్నారు. ఇక మిగిలిన ఎమ్మెల్యేలు పాలనలో వెనుకబడ్డారు.

నాలుగున్నరేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నా విజయనగరం నియోజకవర్గం అభివృద్ధి ఆమడ దూరంలోనే ఉంది. విజయనగరం నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించామని ఎమ్మెల్యే మీసాల గీత చెప్తున్నా ప్రజల్లో మాత్రం అసంతృప్తి ఉప్పెనలా వెలువడుతుంది. జిల్లా కేంద్రం, మున్సిపాలిటీ ఉండటంతో నియోజకవర్గ అభివృద్ధికి భారీ నిధులు విడుదలై నియోజకవర్గం అభివృద్ధి బాటపడుతుందని ఆశించినా ఆ స్థాయిలో ఎక్కడా ఫలితం కనిపించడం లేదు. 

ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకంలో భాగంగా గృహనిర్మాణాలు ఎంపికలో అవకతవకలు, నాన్చుడి ధోరణీ ఆమెకు ఇబ్బందికరంగా మారింది. మరోవైపు హుదూద్ తుఫాన్ బాధితుల కోసం లంకాపట్నంలో నిర్మించిన ఇళ్ల నిర్మాణాలు పూర్తయినా బాధితులకు సక్రమంగా అందించడంలో వైఫల్యం చెందారని ఆరోపణలు ఉన్నాయి.  అటు రోడ్డు విస్తరణ పనులు చేపట్టడంలో విఫలమయ్యారని అలాగే ఎమ్మెల్యేలకు ఇచ్చే ప్రత్యేక అభివృద్ధి నిధులను కేటాయించలేదని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 

నియోజకవర్గంలో పూర్తి స్థాయి తాగునీటి సరఫరా చెయ్యడం లేదు. అలాగే మూసివేసిన జ్యూట్ తెరిపించడంలో కానీ కార్మికులకు బకాయిపడ్డ వేతనాలు ఇప్పించే ప్రయత్నం చెయ్యకపోవడంతో కార్మికులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని విమర్శలు ఉన్నాయి. 

ఇకపోతే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు ఒకప్పుడు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం విజయనగరం. రాబోయే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి అశోక్ గజపతిరాజు లేదా ఆయన తనయ అతిథి గజపతి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. అసలే టీడీపీకి పెద్దదిక్కు,పొలిట్ బ్యూరో సభ్యుడైన అశోక్ గజపతిరాజు లేదా తనయ పోటీకి దిగితే తనకు టిక్కెట్‌కు ఎసరొచ్చినట్లేనని సిట్టింగ్ ఎమ్మెల్యే గీత టెన్షన్ పడుతున్నారు.

 అటు గజపతినగరం నియోజకవర్గం ఎమ్మెల్యే కేఏ నాయుడు సైతం ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గంలో పనులు ఎక్కడికక్కడే పడకేయడం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, ఎమ్మెల్యే స్థానికంగా ఉండకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వందపడకల ఆస్పత్రి, ఆండ్ర జలాశయం ఆధునీకరణ పనులు చేపట్టకపోవడం, మామిడి మార్కెట్ యార్డు నిర్వీర్యం, ఇలా ఎన్నెన్నో సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడం ఎమ్మెల్యే కేఏ నాయుడుకు ప్రతికూలంగా మారాయి. 

ఈ ప్రతికూలతను అనుకూలంగా మార్చుకునేందుకు మాజీమంత్రి పడాల అరుణ, టీడీపీ సీనియర్ నేత శివరామకృష్ణ, కేఏ నాయుడు సోదరుడు కొండబాబులు ప్రయత్నిస్తున్నారు. ఈసారి కేఏ నాయుడుకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తూ చాపకింద నీరులా తమ పైరవీలు చేసుకుంటున్నారు. దీంతో ఎమ్మెల్యే కే ఏ నాయుడు తన బెర్త్ పై ఆందోళన చెందుతున్నారు.

మరోవైపు నెల్లిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామినాయుడు సైతం కాస్త వెనుకబడ్డారు. రాష‌్ట్రంలోనే అత్యంత సీనియర్ ఎమ్మెల్యేగా...మాజీమంత్రిగా నియోజకవర్గ అభివృద్ధివైపు దృష్టిసారిస్తున్నారు. భోగాపురం విమానాశ్రయం చాలా ప్లస్ అయ్యింది. తారకరామ తీర్థ సాగర్ ప్రాజెక్టు పనులకు నిధులు మంజూరు చేయించుకోవడంలో సక్సెస్ అయినా పనులు పూర్తి చెయ్యించలేకపోతున్నారు. 

ఇదిలా ఉంటే సారిపల్లి ఎత్తిపోతల పథకంలో కదలికలు లేకుండా పోయాయి. వయసు దృష్ట్యా రాబోయే ఎన్నికల్లో టిక్కెట్ వచ్చే అవకాశం చాలా తక్కువ అని ప్రచారం ఉంది. ఎమ్మెల్యే తనయులు సైతం రాజకీయంగా అంతగా ప్రభావితం చేయకపోవడంతో ద్వితీయ శ్రేణి నాయకులు నెల్లిమర్ల నియోజకవర్గంపై దృష్టిసారించారు. మంత్రి గంటా శ్రీనివాసరావు సైతం ఈ నియోజకవర్గంపై కన్నేశారని ప్రచారం కూడా జరుగుతుంది.  రాబోయే ఎన్నికల్లో భీమిలి నుంచి గంటా శ్రీనివాసరావు.....నెల్లిమర్ల నుంచి తనయుడుని బరిలో దింపాలని ప్లాన్ చేస్తున్నారట.

చీపురుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీ మంత్రి మృణాళిని సైతం వెనుకంజలో ఉన్నారు. నీతి నిజాయితీలకు నిలువెత్తు అద్దం అయినా ఆమె నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచడంలో ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గిజ్జంగివలసలో 30 పడకల ఆస్పత్రి ఏర్పాటు...గుర్లలో డిగ్రీ కళాశాల ఏర్పాటు, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయించుకోవడంలో విఫలమయ్యారని ప్రజలు మండిపడుతున్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఆమె సీటుపై సందేహం నెలకొంది. 

ఇప్పటికే ఈ సీటుపై  అనేకమంది కన్నేశారు. అయితే తమ కుటుంబంలో ఎవరికో ఒకరికి టిక్కెట్ ఇవ్వాలని మృణాళిని భర్త మాజీ ఎమ్మెల్యే గణపతిరావు కోరుతున్నారు. తనకు లేదా తనయుడు బాలకృష్ణకు అయినా ఇవ్వాలని కోరుతున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారట. అయితే పదేళ్ల కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర రాజకీయాలను ఒంటి చేత్తో శాసించిన బొత్స సత్యనారాయణను ఢీకొట్టాలంటే తమ కుటుంబమే ఢీకొట్టాలని చెప్పుకుంటున్నారు.  

ఇకపోతే ఎస్.కోట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మంచిమార్కులు కొట్టేస్తున్నారు. నియోజకవర్గంలో ఆమె చేస్తున్న అభివృద్ధికి 70శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాగు నీరు, సాగునీరు అందించడంలో విజయవంతమయ్యారు. చంద్రన్న భీమా అందజేయడంలో సీసీ రోడ్లు వేయడంలో సక్సెస్ అయ్యారు. అటు కార్యకర్తలను కలుపుకు పోవడంలో కూడా అగ్రస్థానంలోనే ఉండటంతో ఆమె విజయం నల్లేరుపై నడకేనని చెప్తున్నారు విశ్లేషకులు. 

అయితే ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ సీనియర్ నేత ఏపీఈపీడీసీఎల్ డైరెక్టర్ శోభాహైమావతి దేవీ కుటుంబం కన్నేసింది. శోభాహైమావతి దేవీ పోటీ చేస్తారన్నా ప్రచారం జోరుగా సాగుతుండటంతో ఎమ్మెల్యేను కాస్త ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అయితే ఇటీవల కాలంలో మంత్రి నారా లోకేష్ రాబోయే ఎన్నికల్లో కోళ్ల లలితకుమారిని గెలిపించాలని చెప్పడంతో ఈమె సీటు తనకేనని భావిస్తున్నా ఏదో ఒక అనుమానం వెంటాడుతూనే ఉంది.

అటు బొబ్బిలి ఎమ్మెల్యే మంత్రి సుజయ్ కృష్ణ రంగరావు సైతం నామమాత్రపు ఫలితాలనే అందుకుంటున్నారు. మంత్రి అయ్యాక ప్రజలకు పూర్తిగా దూరమయ్యారన్నవార్తలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి అంతగా ఏమీ చెయ్యడం లేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఈసారి రాబోయే ఎన్నికల్లో ఆయన సోదరుడు బేబీ నాయన బరిలోకి దిగుతారని వార్తలు గుప్పుమంటున్నాయి. ఇకపోతే ఈ సీటు కోసం మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్ముంనాయుడు సైతం పోటీపడుతుండటంతో మంత్రిలో గుబులు పట్టుకుంది. 

ఇక పార్వతీపురం నియోజకవర్గం ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవుల పరిస్థితి దయనీయంగా ఉంది. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా తన ముద్ర వేసుకులేకపోతున్నారని మదనపడుతున్నారు. స్థానికంగా ఎమ్మెల్యే జగదీష్, మున్సిపల్ చైర్మన్ శ్రీదేవీ ఇద్దరు భార్యభర్తలు కావడంతో తన ముద్రకంటే వారి పాలన ముద్రే ఎక్కువ పడుతుండటంతో ఎమ్మెల్యేకు తగిన గుర్తింపు రాలేదన్నది ఆయన అనూయుల ఆవేదన.