Asianet News TeluguAsianet News Telugu

మండుతున్న మాచర్ల.. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో ఉద్రిక్తత..

మాచర్ల మంటల్లో చిక్కుకుంది. టీడీపీ చేపట్టిన  ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో చెలరేగిన గొడవ ఉద్రిక్తతలకు దారితీసింది. 

Tense situation in macherla.. TDP 'Idem Karma Mana Rashtraniki' programme caused fight
Author
First Published Dec 17, 2022, 9:56 AM IST

పల్నాడు జిల్లా  : మాచర్లలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. శుక్రవారం సాయంత్రం మాచర్ల రింగ్ రోడ్ నుంచి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న స్కూల్ వరకు ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని తలపెట్టారు. దీనికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ క్రమంలోనే వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ మొదలయ్యింది.

దీంతో వైసీపీ, టీడీపీ శ్రేణులు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నాయి. దాడిలో పలువురికి గాయాలు, ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకుని ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. దాడి చేసినవారిపై కేసు నమోదు చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో టీడీపీ ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని పోలీసులు  నిలిపివేశారు.టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూలకంటి బ్రహ్మారెడ్డిని మాచర్ల పోలీసులు గుంటూరు తరలించారు. 

వైసీపీ కార్యకర్తల దాడుల్లో మాచర్ల మంటల్లో చిక్కుకుంది. మూడు గంటలకు పైగా ఈ దాడుల ఘటనలు కొనసాగాయి. టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి ఇల్లు, పార్టీ కార్యాలయం, వాహనాలు తగలబెట్టారు. ఇరువర్గాల కార్యకర్తలు శుక్రవారం సాయంత్రం బాహాబాహీకి దిగారు. దింతో మొదలైన గొడవలు రాత్రికి పెచ్చుమీరిపోయాయి. రాళ్లు, కర్రలతో ప్రతీకార దాడులుగా మారాయి. 

టీడీపీ అధినేత చంద్రబాబు మండిపాటు
మాచర్లలో టీడీపీ శ్రేణులపై వైసీపీ గూండాల దాడులు, పార్టీ నేతల ఇళ్లు, పార్టీ కార్యాలయాలకు నిప్పు పెట్టిన ఘటనలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. అధికార పార్టీ రౌడీయిజానికి పోలీసులు కొమ్ము కాయడం ఇంకా దారుణం అని, వైసీపీ గూండాలు అరాచకాలు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఎస్పీ, డీజీపీ ఎక్కడ ఉన్నారు?  ఎందుకు స్పందించడం లేదు? రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతల పరిస్థితికి ఇది అద్దం పడుతుంది. ఇలాంటి చర్యలకు వైసీపీ నేతలు ఇంతకు ఇంత మూల్యం చెల్లించక తప్పదన్నారు.

మాచర్ల లో వైసీపీ హింసపై గుంటూరు డీఐజీకి టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. పరిస్థితులు ఇంత దారుణం గా ఉంటే పోలీసులు ఎందుకు స్పందించలేదని చంద్రబాబుప్రశ్నించారు.తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసిపి గూండాలకు సహకరించిన పోలీసు సిబ్బంది, అధికారులపై నా చర్యలు తీసుకోవాలని  చంద్రబాబు డిమాండ్ చేశారు. 

టిడిపి శ్రేణులపై దాడి దారుణం...నారా లోకేష్
మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ రౌడీ మూకలు పోలీసుల సహకారంతో మరోసారి టిడిపి శ్రేణులపై దాడికి పాల్పడటం దారుణం అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహిస్తున్న టిడిపి వారిపై  వైసీపీ రౌడీలు దాడులకు పాల్పడటం రాష్ట్రంలో అరాచక పాలనకి నిదర్శనం. దాడి చేసిన వైసీపీ గూండాలను వదిలేసిన పోలీసులు టిడిపి కార్యకర్తల పై లాఠీ ఛార్జ్ చెయ్యడం, మాచర్ల టీడీపీ ఇంఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డిని అదుపులోకి తీసుకోవడం వైసీపీకి కొమ్ముకాయడమే. టిడిపి వర్గీయుల కార్లు తగలబెట్టి, దాడులకు పాల్పడిన వైసీపీ గూండాలను తక్షణమే అరెస్టు చేయాలి. వైసిపి రౌడీ మూకల దాడిలో గాయపడిన టిడిపి నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటాం అన్నారు.

మాచర్ల ఎవడబ్బ  జాగీరు పిన్నెల్లి? ...కింజరాపు అచ్చెన్నాయుడు 

మాచర్ల ఏమైనా పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి జాగీరా ? ప్రతిపక్షాలు నిరసన కార్యక్రమాలు చేయకూడదా? టీడీపీ ఇన్ ఛార్జ్ బ్రహ్మారెడ్డిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. తక్షణమే బ్రహ్మారెడ్డిని విడుదల చేయాలి. ఐదుకార్లు ధ్వంసం చేసి, టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకట్రామిరెడ్డి దగ్గరుండి టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. పోలీసులు చూస్తూ ఉండటం దుర్మార్గం. టీడీపీ సానుభూతి పరుల షాపులను కూడా తగలబెట్టారు. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు వెళ్తున్న బ్రహ్మారెడ్డికి వైసీపీ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. 

మాచర్లను గూండాగిరితో మూడున్నరేళ్లుగా చేతిలో పెట్టుకున్నారు. ప్రజల నుండి తిరుగుబాటు మొదలవడంతో విధ్వంసాలు చేస్తున్నారు. వైసీపీ నేతల దుశ్చర్యలను పోలీసులు దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారు. బ్రహ్మారెడ్డి ప్రాణాలకు ముప్పుంది. బ్రహ్మారెడ్డికి చిన్నపాటి అపాయం కలిగించినా టీడీపీ కార్యకర్తలతో పిన్నెల్లి ఇంటిని ముట్టడిస్తాం. మా బ్రహ్మారెడ్డిని చూసి  పిన్నెల్లి  ప్రతి రోజూ భయపడుతూ బ్రతుకుతున్నాడు.ఖబడ్దార్ పిన్నెల్లి..నీ పని అయిపోయింది. నీ ఓటమికి రోజులు లెక్కపెట్టుకో అంటూ హెచ్చరించారు.

మాచర్లలో హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తున్న జగన్ రెడ్డి.. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర
మాచర్లలో  జగన్ రెడ్డి హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. వైసీపీ సమాధికి మాచర్ల ఘటన తొలి పునాది రాయి, మాచర్లలో జరిగిన దాడికి కర్త కర్మ క్రియ జగన్ రెడ్డే అని అన్నారు. ఇదేం కర్మ కార్యక్రమానికి వస్తున్న ప్రజాదరణ చూడలేక దాడులు చేస్తున్నారని, గడపగడపకు వెళ్తున్న వైసిపి బ్యాచ్ కు ప్రజలు చీపురులతో సత్కారాలు ఎదురవుతున్నాయని ఎద్దేవా చేశారు. 'ఇదేం కర్మ రాష్ట్రానికి'తో వెళ్తున్న టిడిపికి ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారన్నారు.

టిడిపి కి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక హత్యా రాజకీయాలకు తెరలేపారు. బ్రహ్మానంద రెడ్డి పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇళ్లల్లో చొరబడి విధ్వంసాలకు పాల్పడడం హేయం. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నామా?జగన్ రెడ్డి హత్య రాజకీయాలను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అమలు చేస్తున్నారు. దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతున్న వైసీపీని ప్రజలు సమాధి కట్టబోతున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా చేసే యాత్రలను కూడా కత్తులతో అడ్డుకుంటున్నారు. జగన్ రెడ్డి నీ హత్య రాజకీయాలను సహించేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు. జగన్ రెడ్డికి సిగ్గు శరం ఉంటే మాచర్ల ఘటనకు బాధ్యత వహించాలి. తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 

పిన్నెల్లి పరిస్థితి పిల్లి కంటే హీనం..నక్కా ఆనంద్ బాబు

మాచర్ల లో టీడీపీ నేతలపై, టీడిపి కార్యాలయంపై వైసీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి పరిస్థితి పిల్లి కంటే హీనంగా తయారైందన్నారు. మా ఇంచార్జ్ బ్రహ్మరెడ్డిని చూసి పిన్నెల్లి ప్రతి రోజూ ఓటమి భయంతో బ్రతుకుతున్నాడు. అందుకే ఎన్నికలు ఏడాది ఉండగానే వైసీపీ గూండాలు దాడులు, విధ్యంసాలతో ప్రజల్ని భయపెడుతున్నారువైసీపీ అరాచక పాలనపై ప్రజల్లో తిరుగుబాటు మొదలయింది.

అధికారమదంతో ఇప్పుడు పిన్నెల్లి చేస్తున్న అరాచకాలకు ముందు రోజుల్లో మూల్యం చెల్లించక తప్పదు. టీడీపీ అధికారంలోకి రాగానే పిన్నెల్లి రామకృష్ణరెడ్డిని మాచర్లలోని పల్నాటి బ్రహ్మానాయుడు విగ్రహం ముందు మోకాళ్లపై కూర్చోబెడతాం అన్నారు.

ఫ్యాక్షన్ నేరచరిత్ర కలిగిన వ్యక్తులు చేసిన గొడవలే.. పల్నాడు జిల్లా ఎస్పీ రవి శంకర్ రెడ్డి

వెల్దుర్తికి సంబంధించిన ఫ్యాక్షన్ నేరచరిత్ర కలిగిన వ్యక్తులు  మాచర్ల పట్టణంలో నివసిస్తున్నారని ముందస్తు చర్యలల్లో  భాగంగా ఈరోజు ఉదయం నుండే అక్కడ కార్డెన్ & సర్చ్ నిర్వహించడం జరిగిందని పల్నాడు జిల్లా ఎస్పీ రవి శంకర్ రెడ్డి అన్నారు. సాయంత్రం జరిగిన ఇదేమి కర్మ రా బాబు  కార్యక్రమంలో పాల్గొన్న ఈ ఫ్యాక్షన్ నేరచరిత్ర కలిగిన వ్యక్తులే ఉద్దేశం పూర్వకంగా సమీప ప్రత్యర్థులపై రాళ్లతో విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు.

పూర్తిగా ఫ్యాక్షన్ కు  సంబంధించిన గొడవకు రాజకీయరంగు పులిమే ప్రయత్నం చేస్తూ ప్రత్యర్థులపై దాడులకు పాల్పడ్డారు. గత 20 నుండి 30 సంవత్సరాలుగా ఈ ఫ్యాక్షన్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దాడులకు పాల్పడిన వాళ్లందర్నీ అదుపులోకి తీసుకుంటున్నాం. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉంది. మాచర్ల సంఘటన స్థలానికి చేరుకున్న జిల్లా ఎస్పీ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios