గుడిలో పూజారిని కూడా దైవంతో సమానం చూస్తారు. దేవుడికి సాధారణ ప్రజలకు పూజారి వారదిలా పనిచేస్తారనే  నమ్మకం ఉంటుంది. అలాంటి పూజారి గుడికి దైవ దర్శనం కోసం వచ్చిన యువతిపై కన్నేశాడు. గర్భగుడిలో యువతి పట్ల అసభ్యంగా  ప్రవర్తించాడు. ఈ దారుణ సంఘటన విజయవాడలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కొద్ది రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రకాష్‌ నగర్‌లోని హరిహర క్షేత్రానికి పక్కన ఓ దేవాలయం ఉంది. ఆ ప్రాంతంలోని మహిళలంతా ఈ ఆలయానికి ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. ప్రతి శుక్రవారం పూజలు, ఇతర కార్యక్రమాలు జరుగుతుంటాయి.
 
ఇద్దరు అక్కా చెల్లెళ్లు గత శుక్రవారం ఈ ఆలయానికి వెళ్లి హోమ గుండం వద్ద కూర్చున్నారు. కాసేపటికి ఆలయ అర్చకుడు వారి వద్దకు వెళ్లాడు. మంత్రోపదేశం చేస్తానని చెప్పి బాలికను ఆలయం పక్కనే ఉన్న గదిలోకి తీసుకెళ్లాడు. ఆమె నుదుటన బొట్టు పెట్టి, నోట్లో నిమ్మకాయ పెట్టాడు. ఆ తర్వాత ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. పూజారి వెంట వెళ్లిన చెల్లి ఇంకా బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన అక్క వెళ్లి గది తలుపు తీసింది. ఇంతలో పూజారి చేస్తున్న అకృత్యం ఆమెకు కనపడింది.
 
అక్కడి నుంచి వెంటనే చెల్లిని తీసుకుని ఇంటికి వెళ్లిపోయింది. ఈ ఘటనతో ఆ అమ్మాయికి జ్వరం వచ్చేసింది. ఆలయంలో జరిగిన విషయం ఆదివారం ఉదయం తల్లిదండ్రులకు తెలిసింది. వారితో పాటు చుట్టుపక్కల వారు వెళ్లి ఆలయంలో పూజారికి భక్తుల సమక్షంలోనే బడిత పూజ చేశారు. ఈ దృశ్యాలు వాట్సాప్‌ గ్రూపుల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. 

కాగా ఈ  ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని నున్న పోలీసులు చెబుతున్నారు. ఈ పూజారిపై ఇంతకుముందు ఈ తరహా ఆరోపణలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు.