అమరావతి: ప్రత్యేక హోదా అంశంపై కేంద్రప్రభుత్వం స్పందించకపోతే తీవ్ర నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని టీడీపీ ఎమ్మెల్సీ టీడీ జనార్థన్ హెచ్చరించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రత్యేక హోదా సాధన కోసం తెలుగుదేశం పార్టీ అవిశ్రాంత పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. 

ఈనెల 30న అంటే బుధవారం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీలు ప్రజా సంఘాలను ప్రభుత్వం తరపున ఆహ్వానించినట్లు తెలిపారు. రాష్ట్రంపై కేంద్రం సవతితల్లి ప్రేమ చూపిస్తోందని ఆయన విమర్శించారు. రాష్ట్రంపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. 

ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టంలోని హామీల అమలుపై కేంద్రం స్పందించకపోతే సీఎం చంద్రబాబు తీవ్ర నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. అవసరమైతే నిరాహార దీక్షకు కూడా వెనుకాడరని చెప్పుకొచ్చారు. 

ఫిబ్రవరి13వరకు లోక్‌సభ సమావేశాలు జరుగుతాయని, మేం 9 వరకు ఎదురుచూస్తామని స్పష్టం చేశారు. మే 10న చంద్రబాబు ఢిల్లీ వెళ్తారని అక్కడ భవిష్యత్ కార్యచరణపై నిర్ణయం ప్రకటిస్తారని తెలిపారు. జాతీయ స్థాయిలో అన్ని పార్టీల మద్దతుతో కార్యాచరణ రూపొందిస్తామన్నారు. 

ప్రజలను కూడా సిద్ధం చేసేందుకు అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు ఫిబ్రవరి1న ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపు మేరకు రాష్ట్ర బంద్‌కు తెలుగుదేశం పార్టీ మద్దతు ఉంటుందని ఎమ్మెల్సీ టీడీ జనార్థన్ స్పష్టం చేశారు.