హైదరాబాద్: ప్రముఖ తెలుగు సాహితీవేత్త ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ఇక లేరు. ఆయన గురువారం తెల్లవారు జామున 4 గంటలకు కన్నుమూశారు. ఆయన వయస్సు 75 ఏళ్లు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. 

శ్రీకాంత శర్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో 1944 మే 29వ తేదీన జన్మించారు ఆయన 1976లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసిస్టెంట్ ఎడిటర్ గా చేరారు. ఆ తర్వాత కాలంలో ఆకాశవాణి కేంద్రానికి విశేషంగా సేవలందించారు. 

కవిత్వంతో పాటు రేడియో నాటికలు, నాటకాలు ఆయన రాశారు. సంగీత రూపకాలను కూడా రచించారు కథలు, పాటలు, పద్యాలు, గేయాలు రాశారు. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ భార్య ఇంద్రగంటి జానకీబాల కూడా రచయితనే. 

ఇంద్రగంటి శ్రీకాంత శర్మ కృష్ణావతారం, నెలవంక, రావు - గోపాలరావు తదితర సినిమాలకు గీత రచన చేశారు ఇటీవలి సమ్మోహనం సినిమాలో మనసైనదేదో అనే గేయం ఆయన రాసిందే.