దేశ రక్షణలో భాగంగా తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఉగ్రవాదులతో తలపడ్డ ఓ తెలుగు జవాన్ వీరమరణం పొందాడు. 

అమరావతి: దేశ రక్షణ కోసం మరో తెలుగురాష్ట్రానికి చెందిన మరో జవాన్ వీరమరణం పొందాడు. ఉగ్రమూకలతో వీరోచితంగా తలపడిన తెలుగు జవాన్ చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఇలా జమ్మూ కాశ్మీర్ రాజౌరీ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు, ఇద్దరు జవాన్లు మరణించారు.

వివరాల్లోకి వెళితే... గురువారం జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరీ జిల్లా సుందర్ బనీ సెక్టార్ లో ఉగ్రవాదులను గుర్తించిన జవాన్లు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే వారు భారత జవాన్లపై కాల్పులకు దిగారు. దీంతో జవాన్లు కూడా ఎదురుకాల్పులకు దిగారు. వీరోచితంగా పోరాడిన భద్రతాదళాలు ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టారు.

read more జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఆర్మీ జవాన్ మృతి..!

అయితే ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు కూడా వీరమణం పొందారు. మరణించిన జవాన్లలో బాపట్ల మండలం దరివాడ కొత్తపాలెం వాసి మరుపోలు జశ్వంత్‌రెడ్డి (23) మృతి చెందారు. ఐదేళ్ల క్రితమే భారత ఆర్మీలో చేరిన జశ్వంత్ ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం ఉగ్రమూకలతో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందాడు. అతడి మరణవార్తతో కొత్తపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.