రాజమండ్రి: కవయిత్రి, పరిశోధకురాలు, విహంగ అంతర్జాల మహిళా పత్రిక సంపాదకురాలు, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏపీ శాఖ అధ్యక్షురాలు పుట్ల హేమలత ఆకస్మికంగా కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో శనివారం సాయంత్రం 3 గంటల ప్రాంతంలో ఆమె తుదిశ్వాస విడిచారు. 

పుట్ల హేమలత ప్రముఖ తెలుగు కవి డాక్టర్ ఏండ్లూరి సుధాకర్ సహచరి. తెలుగు దళిత సాహిత్యంలో ఆమె తనదైన ముద్రను వేశారు. డాక్టర్ పుట్ల హేమలత ఆకస్మిక మరణం తెలుగు సాహిత్యానికి ; దళిత స్త్రీ వాద సాహిత్యానికి అపార మైన లోటు అని కవిసంధ్య ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె ఆకస్మిక మరణానికి కవి సంధ్య తీవ్ర దిగ్భ్రాంతిని, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తేలియ చేసింది.

పుట్ల హేమలత మృతికి తెలంగాణ సాహితి రాష్ట్ర కమిటీ,  ఖమ్మంజిల్లా కమిటీ  సంతాపం ప్రకటించింది.. ఈ మేరకు కపిల రాం కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు.

పుట్ల హేమలత మనోరంజితం, మనష్షే కు తొలి సంతానం. నెల్లూరు, బెంగుళూరుల్లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. బి.ఎ చ‌దివి తర్వాత ట్రైనింగ్ పూర్తి చేశారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి వెబ్‌లో తెలుగు సాహిత్యం తీరు తెన్నులు అనే అంశం పై పిహెచ్.డి చేశారు. హేమలత, ఎండ్లూరిసుధకర్ దంపతులకు ఇరువురు కూతుళ్లు. మానస, మ‌నోజ్ఞ‌. ఎండ్లూరి మానస యువ కథా రచయిత్రి.

హేమలత 1975లో తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడే మొదటి సారి రాసిన తిరిగి రాని పయనం అనే కథను కాథలిక్ చర్చి వెలువరించే క్రీస్తు రాజ దూత అనే పత్రికలో ప్రచురించారు. . 1982లో గూడు చేరిన గువ్వ అనే నవల స్పందన ఆధ్యాత్మిక మాసపత్రికలో ధారావాహికగా ప్రచురితమైంది. దీన్ని నర్సాపూర్ లోని జీవన జ్యోతి ప్రెస్ 1990లో ప్రచురించారు. అనేక సార్లు విశాఖ రేడియో స్టేషన్‌లో కవితలు చదివారు.