విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రశంసల జల్లు కురిపించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారంనాడు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. దుర్గ గుడి అభివృద్ధికి జగన్ 70 కోట్ల రూపాయలు ఇవ్వడం శుభ పరిణామమని ఆయన అన్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు అభివృద్ధి చెందుతున్నాయని ఆయన అన్ారు. యాదగిరిగుట్ట మరో తిరుపతి కావాలని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. బిజెపివి తాత్కాలిక రాజకీయాలని ఆయన అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో బిజెపి ఉండదని ఆయన అన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన నేతల మాటలు చెల్లవని ఆయన అన్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినట్లు బిజెపి ఉరుకులు పరుగులు పెడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. 

Also Read: రియాల్టీ ఉండాలి.. గ్రాఫిక్స్ కాదు: అమరావతిపై తలసాని వ్యాఖ్యలు

విజయవాడలోని గేట్ వే హోటల్లో విజయ డెయిరీ ఉత్పత్తులను విజయవాడ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు. వ్యవసాయం, పాడి పరిశ్రమ రంగాలను ప్రభుత్వం రెండు కళ్లుగా భావించి వాటి అభివృద్ధికి అనేక కార్యకర్మలు అమలు చేస్తోందని ఆయన అన్నారు. 

లక్షలాది మంది జీవనోపాధి పొందుతున్న పాడి పరిశ్రమ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు సహకారంతో తెలంగాణలో అభివృద్ధి పథంలో పయనిస్తోందని ఆయన అన్నారు. గత పాలకుల స్వప్రయోజనాల వల్ల ఈ రంగం కొంత నిర్లక్ష్యానికి గురైందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ముఖ్యమంత్రి తోడ్పాటుతో విజయ డెయిరీ లాభాల బాట పట్టిందని ఆయన అన్నారు. 

ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, విజయ డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి, ఎంపీ శ్రీనివాస రావు కూడా పాల్గొన్నారు.