వైసిపి ఎంపీతో తెలంగాణ మంత్రి... కనకదుర్గమ్మకు మొక్కు తీర్చుకున్న పొంగులేటి
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, తనకు మంత్రి పదవి దక్కడంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విజయవాడ కనకదుర్గమ్మకు మొక్కు చెల్లించుకున్నారు.
అమరావతి : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నియామకం, ప్రమాణ స్వీకారం, బాధ్యతల స్వీకరణ కార్యక్రమాలు చకచకా జరిగిపోయాయి. ముఖ్యమంత్రితో పాటు 11 మంది మంత్రుల ప్రమాణస్వీకారం, శాఖల కేటాయింపు కూడా ముగిసింది. ఇలా ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ముగిసింది. దీంతో ఎన్నికల నోటిపికేషన్ వెలువడిన నాటినుండి ఇప్పటివరకు బిజీబిజీగా గడిపిన నాయకులకు కాస్త సమయం దొరికింది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించి మంత్రిపదవితో ఖమ్మం జిల్లాకు చేరుకున్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఈ క్రమంలోనే మొక్కు తీర్చుకునేందుకు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లారు తెలంగాణ మంత్రి.
విజయవాడకు చేరుకున్న మంత్రి పొంగులేటి వైసిపి ఎంపీ మిథున్ రెడ్డిని కలిసారు. ఇద్దరూ కలిసి విజయవాడ ఆలయానికి చేరుకోగా అర్చకులు, అధికారులు సాదరస్వాగతం పలికారు. కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసారు పొంగులేటి. అనంతరం ఆయనకు ఆలయ పండితులు వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు అందించారు. ఆలయ అధికారులు మంత్రికి అమ్మవారి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేసారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ... తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు. తన కోరికను మన్నించి నెరవేర్చిన కనకదుర్గమ్మకు మొక్కు చెల్లించుకోడానికి విజయవాడకు వచ్చినట్లు తెలిపారు. విజయవాడ దుర్గమ్మ ఆలయానికి ఎన్నోసార్లు వచ్చాను...కానీ ఇలా తెలంగాణ మంత్రిగా రావడం ఆనందంగా వుందని పొంగులేటి అన్నారు.
వీడియో
తెలంగాణ ఏర్పాటుతర్వాత వరుసగా పదేళ్లు బిఆర్ఎస్ పాలించింది... కానీ స్వరాష్ట్ర ఆకాంక్షలను మాత్రం కేసీఆర్ నెరవేర్చలేకపోయారని అన్నారు. సీఎంగా వున్న ఈ పదేళ్లలో అభివృద్ది పేరిట కేసీఆర్ అప్పులు చేసారని ఆరోపించారు. ఇలా ధనిక తెలంగాణను కాస్త కేసీఆర్ అప్పుల తెలంగాణగా మార్చాడని... పదేళ్లలో ఏకంగా రూ.5 లక్షల కోట్ల భారం రాష్ట్రంపై మోపాడని పొంగులేటి ఆందోళన వ్యక్తం చేసారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీలను తప్పకుండా నెరవేరుస్తామని మంత్రి స్పష్టం చేసారు. అలాగే పార్టీ మేనిఫేస్టోలోని ప్రతి హామీని నెరవేరుస్తామని అన్నారు. ఇప్పటికే ఎన్నికల హామీల అమలు ప్రక్రియ ప్రారంభించినట్లు పొంగులేటి తెలిపారు.
Also Read జానారెడ్డిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి.. హోం మంత్రి పదవి ఆయనకేనా ?
ఇక ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తనకున్న సత్సంబంధాలను తెలంగాణ మంత్రి గుర్తుచేసుకున్నారు. జగన్ తో తనకున్న వ్యక్తిగత, రాజకీయ సంబంధాలు వేరువేరని అన్నారు. వ్యక్తిగతంగా సీఎం జగన్ తో పాటు వైసిపి నాయకులు చాలామంది తనకు చాలా క్లోజ్ అని పొంగులేటి అన్నారు.
అన్నదమ్ముళ్లలా విడిపోయిన తెలుగు రాష్ట్రాల మధ్య ఇంకా కొన్ని సమస్యలు వున్నాయని... వాటిని పరిష్కరించుకుంటామని అన్నారు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు సామరస్యంగా వ్యవహరించిన సమస్యల పరిష్కారినికి కృషి చేస్తాయన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు చల్లగా వుండాలని విజయవాడ దుర్గమ్మను కోరుకున్నానని మంత్రి పొంగులేటి తెలిపారు.