రుణమాఫీ ఎవరికి వర్తిస్తుంది? ఎవరికి వర్తించదు? డిటెయిల్డ్ స్టోరీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ ప్రకటించారు. మూడు విడతల్లో రుణమాఫీ పూర్తి చేసి, ఈ నెల 18న మొదటి విడతలో రూ.లక్ష వరకు రుణాలకు నిధులు విడుదల చేయనున్నారు. మరి ఎవరికి రుణమాఫీ వర్తిస్తుంది? ఎవరికి వర్తించదో ఈ స్టోరీలో తెలుసుకుందాం...

Telangana Loan Waiver Scheme: Who Qualifies and Who Doesn't? GVR

తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తీపికబురు చెప్పారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రుణమాఫీపై కీలక ప్రకటన చేశారు. వచ్చే నెల (ఆగస్టు)లోపు మూడు విడతల్లో రుణమాఫీ పూర్తి చేస్తామని ప్రకటించారు. ఈ నెల 18న (గురువారం) సాయంత్రం 4 గంటలకు రుణమాఫీ నిధులు విడుదల చేస్తామన్న సీఎం రేవంత్‌ రెడ్డి... తొలి విడతలో రూ.లక్ష వరకు రైతు రుణాలకు నిధులు విడుదల చేస్తామని తెలిపారు. ఆ మొత్తం రూ.7వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. ఈ నెలాఖరులోపు రూ.లక్షన్నర వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు. ఆగస్టులో రూ.రెండు లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేసి ప్రక్రియ పూర్తిచేస్తామని వెల్లడించారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్‌ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ప్రకటించారు. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. ఆగస్టు 15లోగా హామీ నెరవేరుస్తామంది.

Telangana Loan Waiver Scheme: Who Qualifies and Who Doesn't? GVR

రుణమాఫీ అమలు సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా పండగ వాతావరణంలో సంబరాలు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో కార్యక్రమాలు నిర్వహించాలని.. నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొనాలన్నారు. రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నామని సగర్వంగా చెప్పాలని.. దేశంలో ఏ రాష్ట్రమూ ఒకే విడతలో రూ.31వేల కోట్లతో రుణమాఫీ చేయని ఈ అంశంపై జాతీయస్థాయిలో చర్చ జరగాలన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన గ్యారెంటీని అమలు చేశామని పార్లమెంటులో ఎంపీలు ప్రస్తావించాలని సూచించారు. 

రుణమాఫీ విధివిధానాలివే...

కాగా, తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి ‘వ్యవసాయ, సహకార శాఖ- పంట రుణ మాఫీ పథకం- 2024’ పేరిట స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. తెలంగాణలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రూ.2 లక్షల వరకు పంట రుణ మాఫీ వర్తిస్తుంది. స్వల్పకాలిక పంట రుణాలకు కూడా ఈ పథకం వర్తిస్తుంది.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, వాటి బ్రాంచ్‌ల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలకు రుణమాఫీ వర్తిస్తుంది.

2018 డిసెంబరు 12వ తేదీన లేదా ఆ తర్వాత మంజూరయిన లేక రెన్యువల్ అయిన రుణాలకు, 2023 డిసెంబర్‌ 09వ తేదీ నాటికి బకాయి ఉన్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం కింద ప్రతి రైతు కుటుంబం రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీకి అర్హులు. 2023 డిసెంబరు 09వ తేదీ నాటికి బకాయి ఉన్న అసలు, వర్తింపయ్యే వడ్డీ మొత్తం రుణమాఫీ పథకానికి అర్హత కలిగి ఉంటుంది. 

రైతు కుటుంబాన్ని నిర్ణయించడానికి పౌర సరఫరాల శాఖ వారు నిర్వహించే ఆహార భద్రత కార్డు (పీడీఎస్‌) డేటాబేస్ ప్రామాణికంగా ఉంటుంది. ఆ కుటుంబంలో ఇంటి యజమాని, జీవిత భాగస్వామి, పిల్లలను ఒక యూనిట్‌గా పరిగణిస్తారు.

రుణమాఫీ పథకం కింద లబ్ధిదారులు, రైతు కుటుంబాన్ని గుర్తించడానికి బ్యాంకులు సమర్పించిన రైతు రుణ ఖాతాలోని ఆధార్‌ను పాస్‌బుక్ డేటా బేస్‌లో ఉన్న ఆధార్, పీడీఎస్‌ డేటాబేస్‌లో ఉన్న ఆధార్‌తో మ్యాప్ చేస్తారు. ఈ విధంగా గుర్తించిన ఒక్కో రైతు కుటుంబానికి 2023 డిసెంబరు 09 నాటికి బకాయి ఉన్న క్యుములేటివ్ రుణమాఫీ రూ.2లక్షల వరకు పరిమితి వర్తిస్తుంది.

అర్హత గల రుణమాఫీ మొత్తాన్ని డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్సాక్షన్‌ (డీబీటీ) పద్ధతిలో నేరుగా లబ్దిదారుల రైతు రుణఖాతాలకు జమ చేస్తారు. వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌) విషయంలో రుణమాఫీ మొత్తాన్ని డీసీసీబీ లేదా బ్యాంకు బ్రాంచికి విడుదల చేస్తారు. ఆ బ్యాంకువారు రుణమాఫీ మొత్తాన్ని పీఏసీఎస్‌లో ఉన్న రైతు ఖాతాలో జమచేస్తారు.

ప్రతి రైతు కుటుంబానికి 2023 డిసెంబరు 09వ తేదీ నాటికి ఉన్న రుణమొత్తం ఆధారంగా ఆరోహణ క్రమంలో రుణమాఫీ మొత్తాన్ని జమచేస్తారు.

ప్రతి రైతు కుటుంబానికి 2023 డిసెంబరు 09వ తేదీ నాటికి ఉన్న మొత్తం రుణం గానీ, రూ.2లక్షల వరకు ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని రైతు కుటుంబం పొందుతుంది. 

రూ.2లక్షలకు పైబడి రుణం ఉన్న రైతులు.. రూ.2లక్షల కంటే పైన ఎంత రుణం ఉంటే అంత మొదట బ్యాంకుకు చెల్లించాలి. ఆ తరువాత అర్హతగల రూ.2లక్షల మొత్తాన్ని రైతు కుటుంబీకుల రుణ ఖాతాలకు బదిలీ చేస్తారు.

రూ.2లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న పరిస్థితుల్లో కుటుంబంలో రుణం తీసుకున్న మహిళల రుణాన్ని మొదట మాఫీ చేస్తారు. మిగులు మొత్తాన్ని దామాషా పద్ధతిలో కుటుంబంలో పురుషుల పేరు మీద తీసుకున్న రుణాలను మాఫీ చేస్తారు.


వీరికి వర్తించదు... 

ఈ రుణమాఫీ స్వయం సహాయ సంఘాలు (ఎస్‌హెచ్‌జీలు), జాయింట్ లయబిలిటీ గ్రూప్ (జేఎల్జీలు), రైతు మిత్ర గ్రూపులు (ఆర్ఎంజీలు), ఎల్ఈసీఎస్‌లకు తీసుకున్న రుణాలకు వర్తించదు. 

పునర్ వ్యవస్థీకరించిన లేదా రీషెడ్యూలు చేసిన రుణాలకు రుణమాఫీ వర్తించదు. 

కంపెనీలు, ఫర్మ్స్ వంటి సంస్థలకి ఇచ్చిన పంట రుణాలకు రుణమాఫీ వర్తించదు. కానీ పీఏసీఎస్ ద్వారా తీసుకున్న పంటరుణాలకు వర్తిస్తుంది.

కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పీఎం- కిసాన్ మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం వద్ద డేటా లభ్యంగా ఉన్నంత మేరకు, ఆచరణాత్మకంగా అమలు చేయడం వీలైనంత వరకు పరిగణనలోనికి తీసుకుంటుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios