మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అనివాష్ రెడ్డి పిటిషన్ ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది.
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అనివాష్ రెడ్డి పిటిషన్ ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. వైఎస్ అవినాష్ రెడ్డి పిటిషన్‌పై త్వరగా విచారణ జరపాలని ఆయన తరఫు లాయర్ కోర్టును కోరారు. అయితే సుప్రీం కోర్టు ఆర్డర్ ఇంకా అందలేదని లాయర్ కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు ఆర్డర్ కాపీ లేకుండా ఎలా విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది. అయితే మధ్యాహ్నంలోగా సుప్రీం కోర్టు ఆర్డర్ కాపీని అందజేస్తామని తెలిపారు. దీంతో ఆర్డర్ కాపీని చూసిన తర్వాతే విచారణ ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. మధ్యాహ్నం 2.30 తర్వాత విచారణ జరిపే అంశం పరిశీలిస్తామని తెలిపింది.
ఇక, ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై అభ్యంతరం తెలుపుతూ సునీతరెడ్డి వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఈ పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. అవినాష్ రెడ్డికి ముందస్తుగా లిఖిత పూర్వక ప్రశ్నావళిని అందించాలని సీబీఐ అధికారులకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు కొట్టివేసింది. హైకోర్టు జారీ చేసిన ఆ ఉత్తర్వులపై సీజేఐ ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
అయితే మెరిట్‌ల ఆధారంగా అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు కొనసాగించవచ్చని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. ఇక, అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ఏప్రిల్ 25న తెలంగాణ హైకోర్టులో విచారణకు లిస్ట్ అయినందున కనీసం 24 గంటల పాటు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన తరఫు సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ చేసిన వాదనలను కూడా ధర్మాసనం తోసిపుచ్చింది.
