Asianet News TeluguAsianet News Telugu

వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు ఎదురుదెబ్బ.. ఆ పిటిషన్లను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తమపై సీబీఐ కేసును కొట్టివేయాలని కోరుతూ వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌, ఆయనకు చెందిన వసంత ప్రాజెక్ట్స్‌ సంస్థ దాఖలు చేసిన క్రిమినల్‌ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. 

Telangana high court has dismissed YSRCP MLA Vasantha Krishna Prasad plea to quash CBI case
Author
First Published Dec 11, 2022, 9:52 AM IST

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తమపై సీబీఐ కేసును కొట్టివేయాలని కోరుతూ వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌, ఆయనకు చెందిన వసంత ప్రాజెక్ట్స్‌ సంస్థ దాఖలు చేసిన క్రిమినల్‌ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌.. ప్రా‌సిక్యూషన్ తప్పనిసరిగా కొనసాగుతుందని అన్నారు. ఇందూ ప్రాజెక్ట్స్-ఏపీ హౌసింగ్ బోర్డు క్విడ్ ప్రోకో కేసుకు సంబంధించిన అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, ఛార్జిషీట్‌ను రద్దు చేయడానికి ఇది సరైన కేసు కాదని తేలిందని చెప్పారు. సీబీఐ చేసిన ఆరోపణలను ప్రాథమిక దశలోనే తోసిపుచ్చలేమని పేర్కొన్నారు. 

సీబీఐ నేరారోపణలు, నిర్దోషులమనే పిటిషనర్ల వాదనల వాస్తవికత సరైన విచారణ తర్వాత మాత్రమే నిర్ధారించబడుతుందని జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తెలిపారు. ప్రాసిక్యూషన్‌ ఆరోపించిన విధంగా పిటిషనర్లు కుట్రలో భాగమా కాదా అనేది విచారణ సమయంలో రికార్డు అయ్యే సాక్ష్యాధారాల ఆధారంగా తేల్చాల్సి ఉంటుందని అన్నారు. ‘‘ఈ దశలో పిటిషనర్లపై ప్రాసిక్యూషన్ కేసును కొట్టివేయడం చాలా తొందరతో కూడుకున్నది అవుతుంది’’ అని పేర్కొన్నారు. 

అసలు కేసు ఏమిటంటే.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌పై అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించిన క్విడ్‌ ప్రోకో కేసులో వసంత కృష్ణ ప్రసాద్ నిందితుడిగా ఉన్నారు. వసంత కృష్ణ ప్రసాద్ మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు. వసంత ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో యాభై శాతం వాటాదారుగా ఉన్నారు.  ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆ కంపెనీకి హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో 4.23 ఎకరాల స్థలంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డ్ ద్వారా హౌసింగ్ ప్రాజెక్ట్ లభించింది. క్విడ్ ప్రోకో కేసుల్లో భాగంగా సీబీఐ వసంత కృష్ణ ప్రసాద్‌ను నిందితుడు నెంబర్ 7గా పేర్కొంటూ కేసు నమోదు చేసింది.

ఆయన కంపెనీకి ప్రమోటర్, మేనేజింగ్ డైరెక్టర్ అని.. నేరపూరిత కుట్రలో క్రియాశీల భాగస్వామి అని సీబీఐ పేర్కొంది. కంపెనీ స్పెషల్ పర్పస్ వెహికల్ అని తప్పుడు ప్రాతినిధ్యాన్ని కల్పించడం ద్వారా వసంత ప్రాజెక్ట్స్‌తో అభివృద్ధి ఒప్పందం కుదుర్చుకునేలా ఏపీహెచ్‌బీని ప్రేరేపించారని సీబీఐ ఆయనపై అభియోగాలు మోపింది. రూ. 25.42 కోట్ల విలువైన గచ్చిబౌలి హౌసింగ్ ప్రాజెక్ట్‌లో తుది లబ్ధిదారుల్లో వసంత కృష్ణ ప్రసాద్ ఒకరని సీబీఐ పేర్కొంది. 

నిబంధనలకు విరుద్ధంగా గచ్చిబౌలి హౌసింగ్‌ ప్రాజెక్టులో ప్రసాద్‌ తనకు,  తన బంధువులు, సన్నిహితులకు మూడు విల్లాలను కేటాయించారని సీబీఐ పేర్కొంది.  వసంత ప్రాజెక్ట్‌లకు అనుకూలంగా ఏపీహెచ్‌బీ అమలు చేసిన అభివృద్ధి ఒప్పందం ద్వారా ఆయనకు అప్పగించిన ఆస్తిని మోసపూరితంగా దుర్వినియోగం చేశారని ఆరోపించారు.వసంత ప్రాజెక్ట్స్  బోర్డు మీటింగ్ సమావేశాల తప్పుడు పత్రాలు సృష్టించి, తారుమారు చేసి కుట్రలో భాగమయ్యారని ఆరోపించింది. ఈ క్రమంలోనే ఆయనపై సీబీఐ నేరపూరిత కుట్ర, మోసంతో పాటు పలు అభియోగాలు మోపింది. ఈ కేసు నుంచి తనను తప్పించాలన్న వసంత కృష్ణ ప్రాసాద్ చేసిన అభ్యర్థనను సీబీఐ కోర్టు తోసిపుచ్చింది. అనంతరం ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

Follow Us:
Download App:
  • android
  • ios