జగన్ బెయిల్ రద్దుకు సరైన కారణాలు లేవు... రఘురామ పిటిషన్ కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు..
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు తెలంగాణ హై కోర్టులో చుక్కెదురయ్యింది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్ ను సరైన కారణాలు లేవంటూ కోర్టు కొట్టివేసింది.
హైదరాబాద్ : అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసులో ప్రధాన నిందితుడైన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయడానికి సరైన కారణాలు లేవంటూ శుక్రవారం తెలంగాణ హైకోర్టు పేర్కొంది. షరతులను ఉల్లంఘించిన సంఘటన ఒక్కటీ పేర్కొనలేదని, అందువల్ల బెయిలును రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వలేమంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది.
ముఖ్యమంత్రిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, సాక్షులను ప్రభావితం చేస్తున్నందున బెయిల్ రద్దు చేయాలన్న అభ్యర్థునను సిబిఐ కోర్టు కొట్టి వేయడంతో ఎంపీ రఘురామ కృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ శుక్రవారం తన తీర్పు వెలువరించారు. ‘జగన్ ద్వారా బెదిరింపులు, ప్రలోభాలకు గురైన సాక్షుల వివరాలు వెల్లడించలేదు. అధికార దుర్వినియోగానికి పాల్పడి సహ నిందితులకు కీలక పదవులను కట్టబెట్టడం ద్వారా సాక్ష్యాలను తారుమారు చేయడం, సాక్షులను ప్రభావితం చేస్తారు అన్నవి సరైన కారణాలు కావు.
బెయిల్ రద్దు కోరుతూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ ను సిబిఐ కోర్టు 2021 సెప్టెంబర్ 15న కొట్టివేసింది. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేవని సిబిఐ పేర్కొంది. అన్ని అంశాలను పరిశీలించిన మీదట బెయిల్ రద్దు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ లో జోక్యానికి ఎలాంటి కారణాలు లేవు’ అని తీర్పు వెలువరించారు.
నిట్ లో కీచక లెక్చరర్.. వైవాకు పిలిచి ఒంటిపై చెయ్యేసి.. అసభ్యంగా మాట్లాడుతూ...
ఇదిలా ఉండగా, నిరుడు డిసెంబర్ 27న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ బెయిల్ రద్దు పిటిషన్ పై వాదనలను విన్న తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఆస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇరు వర్గాల వాదనలను విన్న తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ ను రద్దు చేయాలని సీబీఐ కోర్టులో రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ ను గతంలో సీబీఐ కోర్టు కొట్టివేసింది. దీంతో తెలంగాణ హైకోర్టులో 2021 అక్టోబర్ 6న రఘురామకృష్ణంరాజు మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఏపీ సీఎం వైఎస్ కు తెలంగాణ హైకోర్టు 2021, డిసెంబర్ 13న నోటీసులు జారీ చేసింది. ఆస్తుల కేసులో జగన్ పై చార్జీషీట్లు ఉన్నాయని కోర్టుకు రఘురామకృష్ణంరాజు ఆ పిటిషన్ లో ఫిర్యాదు చేశారు. బెయిల్ రద్దు చేసి సీబీఐ దాఖలు చేసిన చార్జ్ షీట్ పై విచారణను వేగవంతం చేయాలని ఆ పిటిషన్ లో రఘురామకృష్ణంరాజు కోరారు.
ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణంరాజు తరపు న్యాయవాదులు హైకోర్టును కోరారు. సీఎం హోదాలో సాక్షులను జగన్ ప్రభావితం చేస్తున్నారని న్యాయవాది వాదించారు. ఈ వాదనలను జగన్ తరపు న్యాయవాది తోసిపుచ్చారు. ఈ కేసులో సీబీఐ తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. కేసులో పురోగతి లేదని సీబీఐ కోర్టులో చెప్పినట్టుగానే కోర్టు విచక్షణకే వదిలేస్తున్నామని హైకోర్టుకు సీబీఐ తరపు న్యాయవాది తెలిపారు. దీంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.