తిరుమల శ్రీవారి చెంత జై తెలంగాణ నినాదాలు
తెలంగాణ భక్తులు శుక్రవారం రాత్రి తిరుమల కొండపై ఆందోళనకు దిగారు. విఐపి సిఫార్సు లేఖలు ఉన్నా తమకు టికెట్లు కేటాయించకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు జై తెలంగాణ నినాదాలు చేశారు.
తిరుమల: తిరుమల శ్రీవారి కొండపై తెలంగాణ భక్తులు శుక్రవారం రాత్రి ఆందోళనకు దిగారు. శ్రీవారి దర్శనానికి తమకు టికెట్లు ఇవ్వడంలో జాప్యం చేసినందుకు నిరసనగా వారు ఆందోళనకు దిగారు. తాము తీసుకుని వచ్చిన సిఫార్లు లేఖలను ఉదయం తీసుకుని అర్థరాత్రి సమీపిస్తున్నా టికెట్లు ఇవ్వకపోవడంపై వారు ఆగ్రహించారు
విఐపి బ్రేక్ దర్శనాల కోసం భక్తుల నుంచి జీఈవో కార్యాలయం సిబ్బంది సిఫార్సు లేఖలను తీసుకున్నారు. రాత్రి 10 గంటలైనా దర్శనం కేటాయింపు సమాచారం రాలేదు. దీంతో తెలంగాణ భక్తులంతా టికెట్లు విక్రయించే ఎంబీసీ 34కు చేరుకున్నారు.
ఏ విధమైన కేటాయింపులు జరగలేదని సిబ్బంది చెప్పడంతో తెలంగాణ భక్తులు ఆందోళనకు దిగారు. విజిలెన్స్ అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే, భక్తులు సహనం కోల్పోయి వారితో వాగ్వాదానికి దిగారు. తెలంగాణవాళ్లకు ఎందుకు టికెట్లు కేటాయించడం లేదని వారు ప్రశ్నించారు.
దర్శనం లేకపోతే లేదని చెప్పాలి గానీ అర్థరాత్రి ఇలా వానలో నిలబెడుతారా అని అడిగారు. విధుల్లో ఉన్నవారెవరూ తమకు సమాధానం ఇవ్వడం లేదని విమర్శించారు. కొంత మంది భక్తులు జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు
ఉన్నతాధికారులు రంగ ప్రవేశం చేయడంతో వివాదం సద్దుమణిగింది. ఆందోళనకు దిగిన భక్తులకు రూ. 300 దర్శనం టికెట్లు ఇవ్వాలని ఉన్నతాధికారులు చెప్పారు. ఒకే విఐపి రెండు మూడు సిఫార్సు లేఖలు ఇవ్వడంతో సమస్య ఎదురైందని అధికారులుఅంటున్నారు.