తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మరణం పట్ల టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్, నారా లోకేష్, యనమల రామకృష్ణుడు తదితరులు విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
తెలుగుదేశం పార్టీ (telugu desam party) సీనియర్ నేత , మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మరణం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం అత్యంత బాధాకరమని... లాయర్‌గా జీవితాన్ని ప్రారంభించి ఎన్టీఆర్ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. శ్రీకాళహస్తి నుండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకుడి అకాల మరణం తనను తీవ్రంగా కలచివేసిందని వాపోయారు. అణునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ.. ప్రజా సమస్యలపై తక్షణం స్పందించేవారని చంద్రబాబు ప్రశ్నించారు. బొజ్జల మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటని.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని టీడీపీ అధినేత ఆకాంక్షించారు. అనంతరం బొజ్జల కుమారుడు సుధీర్, ఇతర కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు చంద్రబాబు.
అటు బొజ్జల గోపాల కృష్ణారెడ్డి మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (kcr) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో టిడిపి హయాంలో తనతో పాటు కలిసి పనిచేసిన రాజకీయ సహచరున్ని, ఆత్మీయ మిత్రున్ని కోల్పోయానని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనారోగ్యం తో బాధపడుతున్న బొజ్జలను ఆయన నివాసానికి వెల్లి పరామర్శించినట్లు కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. బొజ్జల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు సీఎం.
బొజ్జల మరణం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ (nara lokesh) సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాన్నకు ఆప్త మిత్రుడని .. పార్టీ తీసుకున్న ఎన్నో కీలక నిర్ణయాల్లో విలువైన సలహాలు ఇచ్చారని లోకేష్ గుర్తుచేసుకున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఐదుసార్లు, మంత్రిగా ఆయన నిత్యం ప్రజల శ్రేయస్సు కోసం పరితపించే వారని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని లోకేష్ తన సందేశంలో తెలిపారు.
బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి ఇకలేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు (yanamala rama krishnudu) . పార్టీ ఆవిర్భావం నుంచి బొజ్జలతో కలిసి పనిచేశానని ఆయన తెలిపారు. శ్రీకాళహస్తి నియోజవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి ప్రజా నాయకుడిగా తన మార్క్ తో మంచి పేరు సంపాదించారని యనమల ప్రశంసించారు. నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారని... వారి సమస్యలపై తక్షణమే స్పందించేవారని గుర్తుచేశారు. మంత్రిగా పలు శాఖలను సమర్థవంతంగా నిర్వహించారని.. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మృతి పార్టీకి తీరనిలోటని యనమల అన్నారు.
