ఏపీలో తెలంగాణ బృందం చేపట్టిన సర్వే ఇప్పుడు కలకలం రేపింది. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఒక బృందం మంగళవారం ఎన్నికల సర్వే చేపట్టింది. వచ్చే ఎన్నికల్లో ఎవరికి గెలిచే అవకాశం ఉంది..? టీడీపీ ప్రభుత్వంలో పథకాలు మీకు అందాయా? వైసీపీ అధికారంలోకి వస్తుందని మీరు భావిస్తున్నారా? ఏ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని మీరు భావిస్తున్నారు..? ఏ అభ్యర్థికి టికెట్ ఇస్తే.. గెలిచే అవకాశం ఉంది..? లాంటి ప్రశ్నలు అడుగుతూ.. తెలంగాణ బృందం సర్వే చేపట్టింది.

కాగా.. అసలు  ఈ సర్వే ఎవరు  చేయిస్తున్నారంటూ.. స్థానిక టీడీపీ నేతలు ఆ బృందాన్ని ప్రశ్నించారు. వెంటనే స్థానిక వైసీపీ నేతలకు కూడా సమాచారం అందిచారు. ఇరు పార్టీల నేతలు ముకుమ్మడిగా.. సర్వే బృందంపై ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో.. ఆ బృందం తాము ఇక్కడి వాళ్లం కాదని.. ఇక్కడ ఏ పార్టీతో తమకు సంబంధం లేదని తేల్చి చెప్పారు.

తెలంగాణ నుంచి వచ్చి తాము సర్వే చేపడుతున్నామని వారు పేర్కొన్నారు. సర్వే నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం నుంచి అనుమతి పొందామని బృందం పోలీసు అధికారులకు వివరించింది. దీంతో సంబంధిత పత్రాలను పరిశీలించిన పోలీసులు టీడీపీ,  వైసీపీ నాయకులను సంఘటన స్థలం నుంచి పంపించి వేశారు. 40 మంది సభ్యులు గల సర్వే బృందం పట్టణంలోని వార్డుకు ఒకరు చొప్పున సర్వే నిర్వహణకు పూనుకున్నారు. మ రో ఇద్దరు కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తున్నారు.

సర్వే చేసుకునే హక్కు ఎవరికైనా ఉందని డీఎస్పీ కొల్లి శ్రీనివాసులు తెలిపారు. ఇదేవిషయం ఉన్నతాధికారులు తమకు చెబుతూ ఆదేశాలు ఇచ్చారని ఆయన తెలిపారు. కాకపోతే సర్వే పేరుతో ప్రలోభాలకు పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.