తెలంగాణ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఏపీలో మరోసారి హల్ చల్ చేశారు. గతంలో ఒకసారి విజయవాడ పర్యటనకు వచ్చి.. టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన తలసాని.. మరోసారి చంద్రబాబుకి తలనొప్పిగా మారారు. గురువారం ఆయన విజయవాడ పర్యటనకు వచ్చారు.

ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు.  ఆంధ్రాలో యాదవులు పూటకూడా గడవని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. చంద్రబాబుకి చెందిన హెరిటేజ్ మాత్రం వందల కోట్ల టర్నోవర్ చూపిస్తోందన్నారు.

ఏపీలో పరిపాలన గాడితప్పిందని తలసాని అభిప్రాయపడ్డారు. రాజధాని అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోందని ఆరోపించారు. తాము ఏం చెప్పినా నడుస్తుందిలే అన్న భావనలో ఏపీ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం వాస్తవాలను కప్పిపుచ్చుతోందని దుయ్యబట్టారు. గతంలో తాను ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు తనవాళ్లను టీడీపీ నేతలు వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమన్నారు. పేదప్రజలపై ఏపీ ప్రభుత్వం ఏనాడు ఫోకస్ చేయలేదని మండిపడ్డారు. ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకి బీసీలు గుర్తుకువస్తారా అని ప్రశ్నించారు.