Asianet News TeluguAsianet News Telugu

ఐఎఎస్ ను తాకిన తాహశీల్దార్ అవినీతి : చంద్రబాబు ఆగ్రహం

అధికారుల తీరు వల్ల నా ప్రభుత్వం అపకీర్తి పాలవుతూ ఉంది : ఆగ్రహించిన  ముఖ్యమంత్రి చంద్రబాబు

Tehsildar corruption hits senior IAS officer hard in AP
  • Facebook
  • Twitter
  • Whatsapp

భీమిలి తాహశీల్దార్ అవినీతి దెబ్బ ఆంధ్రప్రదేశ్ కు చెందిన సినియర్ ఐఎఎస్ ఆఫీసర్ అనిల్ చంద్ర పునేతా కు  తగిలింది,  ఆయన గూబ గుయ్యుమంది.

 

అనిల్ చంద్రపునేత ఇపుడు సిసిఎల్ఎ (చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ). త్వరలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రెటరీ కోబోతున్నాడని వార్తలు వెలువడుతున్నాయి. చీఫ్ సెక్రెటరీ రేస్ లో అందరికంటే ముందున్నాడని  చెబుతారు. అలాంటపుడు ఎక్కడో విశాఖ పట్టణం జిల్లా భీమ్లీ తాహశీల్దార్ ఆయన మీద దెబ్బ వేశాడు.

 

ఈ తాహశీల్దార్ కథ నిన్ననే ఎసియానెట్ ప్రచురింది.

 

 బిటివి రమణారావు అనే భీమ్లీ తాహశీల్దార్ ప్రభుత్వం కొత్త గా రూపొందించి వెబ్ లాండ్ అనే పథకం నుంచి భారీ గాసొమ్ము చేసుకున్నారు. ఈ పథకం నుంచే అనేందుకు గుర్తు ఏమిటంటే, ఆయన దగ్గర దొరికిన అక్రమసొమ్ములో 41 లక్షల విలువయిన కొత్త కరెన్సీనోట్లు దొరికాయి. ఇంతమొత్తం బ్యాంకు లనుంచి తీయడం కష్టం. అందువల్ల ఏమనుకోవచ్చు, ఇతగాడు రైతులనుంచి వసూలు చేశాడిదంతా అనే.

 

వెబ్ లాండ్ స్కీంలో ప్రభుత్వంలో ఉండే రికార్డులతో  నీ భూమి టాలీ అయినపుడే ఈ భూమి రిజస్ట్రేషన్ కు వీలవుతుంది. రైతు రికార్డులు,ప్రభుత్వ రికార్డులు టాలీ కాకపోతే అంతే సంగతులు, మీ భూమి వివరాలు మార్పించుకునేందుకు ఎమ్మార్వో చుట్టు తిరగాలి.

 

అమ్యామ్యాలు అర్పించాలి. లేకపోతే టెన్షన్. దీనిని సొమ్ము చేసుకునేందుకు ఎమ్మార్వోలు  భూవివరాలు కావాలనే తప్పుగా నమోదు చేసి, రైతులను ఏడిపించి, లంచం తీసుకుని, వివరాలు సరి చేయడం మొదలు పెట్టారు. ఈ స్కీం అవినీతి తాహశీల్దారుల పాలిట కల్పవృక్షం అయిపోయింది.

 

భీమ్లీ రమణారావు కూడా ఈ పథకం లబ్దిదారుడు.  రావుగారి ఇంట్లో నిన్న ఎసిబి దాడులు జరిగాయి.  సాయంకాలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెబ్ లాండ్ రివ్యూ జరిగింది.  పునేత ఈ పథకం  అమలు తీరు గురించి ఉపన్యాసం దంచేస్తున్నపుడు చీఫ్ సెక్రెటరీ ఈ పథకం నుంచి బయటపడుతున్న అవకతవకల మీద అసంతృప్తి వ్యక్తం చేశారు.

 

అంతే, ముఖ్యమంత్రి అందుకుని భీమ్లీ తాహశీల్దార్ సంపాదన ప్రస్తావించి,‘ పునేతా,  నీ నాయకత్వం విఫలమయింది,’ అని అగ్రహంవ్యక్తం చేశారు.  నీ చేత ఏమికావడం లేదు, పథకం భ్రస్టు పట్టించావు, దీనివల్లే తాహశీల్దార్లు దోచుకుంటున్నారు.  నా ప్రభుత్వం అపకీర్తి పాలవుతూ ఉంది,‘ అని నిప్పులు చెరిగారు. 

 

మూడు నాలుగు రోజుల్లో వ్యవస్థనంతా సరి చేయకపోతే, తీవ్ర పరిణామాలని హెచ్చరించాడు. సిఎం ఒక సీనియర్ ఐఎఎస్ అధికారిని ఇలా అందరి ముందు నిలదీయం ఎపుడూ జరగలేదు. ‘భార్య బిడ్డలనుకాదని నేను పనిచేస్తున్నాను, ఎక్కడ ఉన్నా రాష్ట్రం కోసం తపన చెందుతున్నా. విదేశాలలో ఉన్న నేను విశాఖ వీధి దీపాలగురించేఆలోచిస్తుంటాను. కాని, అమరావతిలో ఉండి పక్కలో ఏమిజరుగుతున్నదో కూడా తెలుసుకోలేకపోతున్నారు మీరు,‘ అని అరిచారు.

 

ముఖ్యమంత్రి  ముఖ్యకార్యదర్శి సతీష్ చంద్ర కూడా ఈపథకం అమలు తీరు సరిగ్గా లేదని సమాచారం అందిందని ఆజ్యం పోశాడని తెలిసింది.

 

ఈ సంఘటన వల్ల రాష్ట్రంలో అధికారులు రైతులను ఎలా వేధిస్తుంటారో  వెల్లడయింది. రెవిన్యూ శాఖలో అవినీతి ఎలా తాండవిస్తున్నదో తెలిసింది.

 

ఇది ఆ శాఖనుచూస్తున్న ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణ మూర్తి  ప్రతిష్టకు కూడా దెబ్బే అంటున్నారు, తెలుగుదేశీయులు.

 

Follow Us:
Download App:
  • android
  • ios