గుంటూరు: సమాజంలో రోజురోజుకు మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. విద్యాబుద్దులు నేర్పాల్సిన గురువులు కామంతో చిన్నారుల పాలిట కాలనాగులా మారి కాటు వేస్తున్నారు. తెలిసీతెలియని వయసులో ఉన్న చిన్నారులకు జీవిత పాఠాలు చెప్పకుండా ప్రేమ పేరుతో వారిని లొంగదీసుకుని వారి జీవితాలతో ఆటలాడుకుంటున్నారు.

వివరాల్లోకి వెళ్తే ఇలాంటి ఘటనే గుంటూరు జిల్లా దాచేపల్లి మదర్సాలో చోటు చేసుకుంది. మదర్సాలో టీచర్ గా పనిచేస్తున్న సత్తార్ అనే వ్యక్తి ఓ విద్యార్థినిని ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు.  

స్కూల్ సమయం అయిపోయినా కూడా విద్యార్థిని ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన బంధువులు పాఠశాలకు వెళ్లి చూడగా ఉపాధ్యాయుడితో ఏకాంతంగా గదిలో ఉండగా పట్టుకున్నారు. విద్యార్థిని బంధువులు, కుటుంబ సభ్యులు మదర్సా వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పాఠాలు చెప్పమని పంపిస్తే పాడు చేస్తావా అంటూ  సత్తార్ పై దాడికి దిగారు. బడిత పూజ చేశారు. 


దాడికి దిగడంతో సత్తార్ దిగొచ్చాడు. విద్యార్థినిని పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. సత్తార్ ప్రేమ విషయం, యువతితో గదిలో దొరికిపోవడం,పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడం వంటి విషయాలు తెలుసుకున్న మెుదటి భార్య మదర్సా వద్దకు చేరుకుంది. 

కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఆందోళనకు దిగింది. దీంతో ఇరువర్గాలు పోటాపోటీగా నినాదాలు చేసుకుంటూ ఆందోళనకు దిగడంతో మదర్సా వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విషయం కాస్త పోలీసుల దృష్టికి చేరడంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇరువర్గాలను శాంతింప జేసేందుకు ప్రయత్నిస్తున్నారు.