ఏపీలో కొత్త వేరియెంట్‌కు సంబంధించి రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కర్నూలు జిల్లాలో పోటాపోటీగా ఫిర్యాదులు నమోదవుతున్నాయి. మంత్రి శిదిరి అప్పలరాజుపై వన్‌టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు స్థానిక టీడీపీ నేతలు.

ఎన్440కే వేరియెంట్ కర్నూలులో వున్నట్టు నిర్థారణ అయ్యిందని.. అది ప్రమాదకరమైనదని స్వయంగా మంత్రే ఓ డిబేట్‌లో అన్నారని టీడీపీ ఫిర్యాదులో తెలిపింది. మంత్రిపై కూడా కేసు నమోదు చేయాలని టీడీపీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.

కరోనా విషయంలో టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు మంత్రి శిదిరి అప్పలరాజు. చంద్రబాబు, లోకేశ్ బ్యాచ్ ప్రజలు భయభ్రాంతులకు గురిచేసేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. కొత్త వేరియెంట్‌పై వారు చేస్తున్న వ్యాఖ్యలు ప్రచారం కారణంగా ఢిల్లీ, ఒడిశా రాష్ట్రాల్లో తెలుగు ప్రజలను రానివ్వడం లేదని మంత్రి అన్నారు. 

Also Read:కరోనాపై బాబు వ్యాఖ్యలు:నేడు నోటీసులివ్వనున్న కర్నూల్ పోలీసులు

కాగా, చంద్రబాబు కరోనా ఎన్ 440-కే వేరియంట్  ఉందని తప్పుడు ప్రచారం చేసి తమను భయబ్రాంతులకు గురి చేశారని  కర్నూల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్బయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రెండు రోజుల క్రితం  సుబ్బయ్య కర్నూల్ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయమై చంద్రబాబునాయుడికి  41 సీఆర్‌పీసీ సెక్షన్ కింద  పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు.