మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఓ మహిళతో కలిసి తనను వేధిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్పూరి కల్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసారు.
విజయవాడ: మాజీ మంత్రి కొడాలి నాని (kodali nani), ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (vallabhaneni vamsi) తనను వేధిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ (TDP) మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్పూరి కల్యాణి ఆరోపించారు. తనను చాలా అసభ్యకరంగా తిడుతున్న ఆడియోను సోషల్ మీడియా ద్వారా పంపారంటూ కల్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను ఇష్టంవచ్చినట్లు తిట్టిన మహిళతో పాటు ఆ ఆడియోను తనకు పంపిన ఎమ్మెల్యేలిద్దరిపై చర్యలు తీసుకోవాలని కల్యాణి హనుమాన్ జంక్షన్ పోలీసులను కోరింది.
కృష్ణా జిల్లా గన్నవరంలో ఎన్టీఆర్ విగ్రహం కనిపించకుండా వైసిపి నాయకులు భారీ ప్లెక్సీలు ఏర్పాటుచేసారు. ఇటీవల ఎన్టీఆర్ జయంతి రోజున ఈ ప్లెక్సీల గురించి వైసిపి నాయకులను నిలదీసానని... ఇది మనసులో పెట్టుకుని స్థానిక ఎమ్మెల్యే వంశీ తనను టార్గెట్ చేసాడని కల్యాణి తెలిపింది. తన స్నేహితుడైన మరో ఎమ్మెల్యే కొడాలి నానితో కలిసి వంశీ తనకు అసభ్యకరంగా తిడుతున్న ఆడియోను పంపారని కల్యాణి ఆరోపించారు.
గన్నవరంకు చెందిన రాచేటి రూతమ్మ అనే మహిళతో తనను ఇష్టంవచ్చినట్లు తిట్టించి ఆ ఆడియోను ఈ నెల 10న తనకు సోషల్ మీడియాలో పంపిచారని కల్యాణి వాపోయింది. ఇలా వాట్సాప్ లో పంపిన ఆడియోను కూడా పోలీసులకు అందించింది. ఇలా తనను తిట్టిన మహిళతో పాటు ఎమ్మెల్యేలు కొడాని నాని, వంశీపై చర్యలు తీసుకోవాలని తెలుగు మహిళ కల్యాణి పోలీసులను కోరారు. ఆమె పిర్యాదును పరిశీలిస్తున్నామని... విచారణ తర్వాత నిజానిజాలను నిర్దారించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇదిలావుంటే ఇటీవల పదో తరగతి విద్యార్థులతో నారా లోకేష్ నిర్వహిస్తున్న జూమ్ మీటింగ్ లో అక్రమంగా చొరబడ్డారంటూ కొడాలి నాని, వంశీపై టిడిపి నాయకులు పోలీసులకు పిర్యాదులు చేసారు. ఈ వ్యవహారంలో భారీ కుట్ర దాగివుందంటూ టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య సీఐడి అడిషనల్ డీజీపీ కి పిర్యాదుచేసారు.
లక్షలాది మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలో ఫెయిలై తీవ్ర భయాందోళనలో వుంటే వీరిలో ఆత్మవిశ్వాసం, ధైర్యాన్ని నింపేందుకు లోకేష్ జూమ్ మీటింగ్ నిర్వహించారన్నారు. ఫెయిలైనందుకు తీవ్ర మనస్థాపంతో బలవన్మరణాలకు పాల్పడిన విద్యార్ధుల కుటుంబాలకు జూమ్ మీటింగ్ ద్వారా భరోసా కల్పించే ప్రయత్నం చేసారన్నారు. అలాంటి మీటింగ్ లో కొంతమంది వైసీపీ నేతలు ఆహ్వానం లేకుండానే తప్పుడు పేర్లతో లాగిన్ అయ్యి మీటింగ్‌లోకి చొరబడ్డారన్నారని... ఇందులో కుట్రకోణం దాగివుందని వర్ల రామయ్య పేర్కొన్నారు.
రెండు రాజకీయ సమూహాల మధ్య గొడవలు పెట్టేందుకు వైసీపీ నాయకులు కొడాలి నాని, వల్లభనేని వంశీతో పాటు మరికొందరు లోకేష్ నిర్వహించిన జూమ్ మీటింగ్‌లోకి చొరబడ్డారంటూ వర్ల రామయ్య పేర్కొన్నారు. నేరపూరిత కుట్రతో లోకేష్ నిర్వహిస్తున్న జూమ్ మీటింగ్ భగ్నం చేయాలని... రాజకీయ వైషమ్యాలు కల్పించాలని చూసారని అన్నారు. కాబట్టి అధికార వైసీపీ నేతలపై మోసం, నేరపూరిత కుట్ర సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని.. వీలైనంత త్వరగా విచారించి దోషులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని సీఐడి ఏడిజిపిని వర్ల రామయ్య కోరారు.
