వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును విచారిస్తున్న సిబిఐపై అనుమానం వ్యక్తం చేశారు టిడిపి నాయకులు వర్ల రామయ్య. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణను పర్యవేక్షించేందుకు సిట్టింగ్ జడ్జిని నియమించాలని ఆయన హైకోర్టు చీఫ్ జస్టిన్ ను కోరారు.
విజయవాడ: రాష్ట్రంలో మానవహక్కుల ఉల్లంఘన, ఆర్టికల్ 19 దుర్వినియోగంపై జాతీయమానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ కు లేఖరాసినట్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య తెలిపారు. అలాగే మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసు విచారణ పర్యవేక్షణ సిట్టింగ్ జడ్జీ నేతృత్వంలో జరిగేలా చూడాలని హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ను కోరారు రామయ్య.
రాష్ట్రంలో మానవహక్కులకు తీవ్ర విఘాతం కలుగుతోందని, డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా దేశంలోని పౌరులకు సంక్రమించిన హక్కుల్లోని భావ ప్రకటనా సేచ్ఛ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రయ్యాక ఏపీ ప్రజలకు లేకుండాపోయిందని వర్ల ఆందోళన వ్యక్తం చేశారు.
''జగన్మోహన్ రెడ్డి అరాచకం చేస్తున్నా, తప్పుల మీద తప్పులు చేస్తున్నా అందరూ ఆయనకు జీహూజూర్ అనాలని డీజీపీ భావిస్తున్నారా? రాష్ట్రంలో ఆర్టికల్ 19 అనేది తాత్కాలికంగా రద్దుచేయబడినట్టు తమకు అనిపిస్తోంది. రాష్ట్రంలో ఎవరూ ఎలాంటి నిరసన తెలియచేయడానికి, భావాలను వ్యక్తంచేయడానికి, స్వేచ్ఛగా మాట్లాడటానికి అవకాశం లేదా? చూడబోతే ఇవన్నీ ప్రతిపక్షసభ్యులకే వర్తించేలా డీజీపీ వ్యవహరిస్తున్నారు'' అని ఆరోపించారు.
''నిషేధం, బలవంతమనేవి తెలుగుదేశం పార్టీ పై రుద్దడానికే వినియోగిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నిరసనలపై ప్రభుత్వం ఇనుపపాదం మోపుతోంది. కొత్తగా మరోటి మొదలెట్టారు... హౌస్ అరెస్టులంట! హౌస్ అరెస్ట్ చేయడమంటే ఆర్టికల్ 19ను ఉల్లంఘించడమే. డీజీపీ సవాంగ్ రాజ్యాంగం గురించి స్పష్టంగా, క్షుణ్ణంగా తెలుసు. గతంలో చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంతానికి బస్ లో వెళుతుంటే కొందరు దుండగులు అకారణంగా ఆయన వాహనంపై దాడి చేశారు. రాళ్లు, కర్రలు, చెప్పులు విసిరేశారు. ఆనాడు జరిగిన ఘటనను సమర్థిస్తూ, డీజీపీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 19ప్రకారం నిరసన తెలిపే హక్కు భారతీయులందరికీ ఉంది... అలానే అక్కడ దాడిచేసినవారికీ ఉందన్నారు. మరి ఆనాడు వారికున్న హక్కు, ఈనాడు టీడీపీవారికి, సామాన్యులకు లేదా? డీజీపీ చెబుతున్న ఆర్టికల్ 19 హక్కులు టీడీపీవారికి సంక్రమించవా?'' అని వర్ల నిలదీశారు.
''విశాఖ విమానాశ్రయంలో చంద్రబాబును అడ్డుకున్నారు. దానిపై కూడా డీజీపీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ ఘటనలోనే కోర్టు డీజీపీతో సీఆర్ పీసీ 151 గురించి చదివించింది. ఇంత జరిగినా, కోర్టులు పలుమార్లు మొట్టికాయలు వేసినా డీజీపీలో మార్పులేదు'' అన్నారు.
read more వైఎస్ వివేకా హత్యకేసు దర్యాప్తులో సీబీఐ దూకుడు: గోవాలో సునీల్ యాదవ్ అరెస్ట్
''మొన్నటికి మొన్న కొండపల్లి అక్రమ మైనింగ్ ను పరిశీలించడానికి వెళ్లిన మాజీ మంత్రి దేవినేని ఉమాపై దాడిచేసి, తప్పుడుకే సులుపెట్టి అకారణంగా జైలుకు పంపారు. ఆ వ్యవహారంలో ముద్దాయి ఫిర్యాదుదారు అయితే పిర్యాదుదారు ముద్దాయి అయ్యాడు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిజనిర్థారణ బృందాన్ని నియమించి అక్రమ మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించమని చెప్పారు. తమతోపాటు ప్రభుత్వ బృందాన్నికూడా పంపాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ను కూడా కోరాము. కానీ ఆయనెందుకో పంపలేకపోయారు. అక్కడకు వెళదామనుకున్న టీడీపీ బృందంలోని సభ్యులను ఒకరోజు ముందే హౌస్ అరెస్ట్ చేశారు. వారిని కనీసం ఇళ్లలోనుంచి కూడా బయటకు రానివ్వలేదు. మరి వారికి ఆర్టికల్ 19 వర్తించదా? ఆర్టికల్ 19 ద్వారా నిరసన తెలిపేహక్కు అందరికీ ఉందని గతంలో చెప్పిన డీజీపీ, ఇప్పుడుదాన్ని కొందరికే ఎందుకు పరిమితం చేశాడన్నదే తమ ప్రశ్న'' అంటూ నిలదీశారు.
''ఈ వ్యవహారంపై జాతీయ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించాం. జాతీయ మానవహక్కుల కమిషన్ ఛైర్మన్ హెచ్.ఎల్. దత్తుకి ఒకలేఖ రాస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిత్వంలో, సవాంగ్ నేతృత్వంలో రాష్ట్రంలో మానవహక్కులు ఏవిధంగా హరింపబడుతున్నాయనే దానిపై పూర్తివివరాలతో ఎన్.హెచ్.ఆర్.సీకి లేఖ రాస్తున్నాం'' అని వెల్లడించారు.
''ఈ సమయంలో మానవ హక్కుల సంఘానికి చెందిన కమిటీ రాష్ట్రంలో పర్యటించకపోతే, ఏవిధంగా ప్రజలహక్కులు హరింపబడుతున్నాయో వివరిస్తాం. సదరు కమిటీ పరిశీలించి, ప్రభుత్వానికి బుద్ధిచెప్పకపోతే, డీజీపీ నోరుమూయించకపోతే, ప్రజలెవరూ స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితిలేదని తెలియచేస్తున్నాం. ప్రశ్నించేనోళ్లను శాశ్వతంగా మూసేయాలని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడటానికి వీల్లేదన్న ట్లు, ప్రభుత్వం ఏకంగా ఒకశాసనమే తీసుకొచ్చేలా ఉంది. ఈ పరిస్థితులన్నీ గమనించిన మీదటే జాతీయమానవహక్కుల కమిషన్ ఛైర్మన్ కు లేఖరాయాలని నిర్ణయించాము'' అని తెలిపారు.
''ఎన్.హెచ్.ఆర్.సీ వెంటనే స్పందించి, నిష్ణాతులైన ప్రత్యేక బృందాన్ని రాష్ట్ర పర్యటనకు పంపాలని కోరుతున్నాం. ప్రత్యేక బృందం రాష్ట్రంలో పర్యటించి, ఈ ప్రభుత్వానికి, ఈ డీజీపీకి, ముఖ్యమంత్రికి జ్ఞానబోధ చేయాలని ఎన్.హెచ్.ఆర్.సీ వారిని కోరుతున్నాం. తాము రాస్తున్నలేఖలోని నిజానిజాలను తేల్చాలని కోరుతున్నాం'' అన్నారు.
''జగన్మోహన్ రెడ్డి తప్పుచేసినా అందరూ ఒప్పని, ఆహా ఓహో అని చప్పట్లు కొట్టాలని డీజీపీ భావిస్తున్నారా? తక్షణమే ఆయన తన పంథా, పద్ధతి, విధానం మార్చుకోవాలి. డీజీపీకి రాష్ట్రంలోని అన్ని వర్గాలవారు, అన్ని పార్టీలవారు సమానమే. కాబట్టి ఆయన అందరికీ సమాన హక్కులు కల్పించాలని కోరుతున్నాం. అదే విధంగా జగన్ ప్రభుత్వం తక్షణమే ఆర్టికల్ 19ను రాష్ట్రంలో పునరుద్ధరించాలని, తిరిగి ఉపయోగంలోకి తీసుకురావాలని కోరుతున్నాం'' అన్నారు వర్ల రామయ్య.
''వివేకానందరెడ్డి పెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. అలాంటి వ్యక్తి అకస్మాత్తుగా, అనుమానాస్పదంగా , 2019 మార్చి 15న ఘోరంగా హత్యచేయబడ్డారు. దాన్ని విజయసాయి రెడ్డి, అక్కడున్న వారు, సాక్షి టీవీవారు గుండెపోటుగా చిత్రీకరించాలని ప్రయత్నించారు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు హత్యకేసు విచారణపై సిట్ దర్యాప్తుకు ఆదేశిస్తే, జగన్మోహన్ రెడ్డి సీబీఐ విచారణ కోరారు. ఆనాడు సీబీఐ విచారణ కోరిన వ్యక్తే తరువాత హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించే సమయానికి తన పిటిషన్ వెనక్కు తీసుకున్నాడు. ఆయినా సరే కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. రెండున్నరేళ్లుగా వివేకా హత్యకేసు విచారణను సీబీఐ చేస్తోంది. సీబీఐ విచారించిన కేసులు ఏమయ్యాయో గతంలో మనం కొన్ని అనుభవాలు చూశాము. ఆ అనుభవాల నేతృత్వంలో వివేకా హత్యకేసు విచారణ పర్యవేక్షణను సిట్టింగ్ జడ్జీకి అప్పగించాలని హైకోర్ట్ చీఫ్ జస్టిస్ వారిని నేను కోరుతున్నాను'' అన్నారు వర్ల రామయ్య.
