రోజాకు మద్దతిచ్చే హీరోయిన్లు అప్పుడు ఎందుకు స్పందించలేదు?: వంగలపూడి అనిత
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జైలులో ఉండటం బాధకరమని ఆ పార్టీ నాయకురాలు వంగలపూడి అనిత అన్నారు. అయితే తమకు న్యాయ వ్యవస్థపైన నమ్మకం ఉందని చెప్పారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జైలులో ఉండటం బాధకరమని ఆ పార్టీ నాయకురాలు వంగలపూడి అనిత అన్నారు. అయితే తమకు న్యాయ వ్యవస్థపైన నమ్మకం ఉందని చెప్పారు. వంగలపూడి అనిత ఈరోజు రాజమండ్రిలో ఉన్న నారా భువనేశ్వరిని కలిశారు. అనంతరం అనిత మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి రోజా ఇన్ని రోజులు చాలా వెటకారంగా మాట్లాడిందని.. ఈరోజు ఆమె వరకు వస్తేగానీ బాధ తెలియలేదా? అని ప్రశ్నించారు. 2014-19 మధ్య కాలంలో అసెంబ్లీలో తన గురించి రోజా చాలా అసభ్యకరంగా మాట్లాడిందని చెప్పారు. ఆరోజు తాను ఏడిస్తే.. దొంగ ఏడుపులు అంటూ రోజా కామెంట్ చేసిందని అన్నారు. మరి ఇప్పుడు రోజా ఏడుపులు గ్లిజరిన్ ఏడుపులా?, మహానటి ఏడుపులా? అని ప్రశ్నించారు.
రోజాను సమర్ధిస్తూ ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లు మాట్లాడటం దౌర్భగ్యం అని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో హీరోయిన్లు ఎవరూ మాట్లాడరని, ఆమె సహచర మంత్రులు ఎవరూ కూడా మాట్లాడరని.. కానీ తమిళనాడులోని హీరోయిన్లు మాట్లాడతారని ఎద్దేవా చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ భార్య గురించి చాలా దారుణంగా మాట్లాడినప్పుడు సినీ ఇండస్ట్రీ, రోజాకు సపోర్టు చేస్తున్న హీరోయిన్లు ఏమయ్యారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కూతురు భువనేశ్వరి గురించి అసెంబ్లీ సాక్షిగా నోటికొచ్చినట్టుగా మాట్లాడితే.. ఈ హీరోయిన్లు అప్పుడు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
సినిమా టికెట్ల ధరల గురించి.. సినీ ఇండస్ట్రీలోని పెద్ద పెద్ద హీరోలు సీఎం జగన్ వద్దకు వెళ్లి కాళ్లు మొక్కినప్పుడు వీళ్లు ఏమయ్యారని ప్రశ్నించారు. ప్రపంచంలో రోజా ఒక్కరే మహిళా? అని ప్రశ్నించారు. రోజాకు బాధ అంటే ఏమిటో ఈరోజు పరిచయం అయినట్టుగా ఉందేమో అని అన్నారు. కానీ తమకు బాధ ఏమిటో రోజా ఎప్పుడో పరిచయం చేసిందని అన్నారు. తమ ఫొటోలను మార్పింగ్ చేస్తున్నారని.. మరి అలాంటప్పుడు ఈ హీరోయిన్లు ఎందుకు బయటకు రారని ప్రశ్నించారు. రోజాను సమర్ధించిన వాళ్లు వారి విలువను దిగజార్చుకున్నారని అన్నారు.
చంద్రబాబును అరెస్ట్ చేస్తారని తెలిసే సీఎం జగన్ లండన్ పారిపోయారని వంగలపూడి అనిత అన్నారు. చంద్రబాబును కక్షపూరితంగా అరెస్ట్ చేయలేదంటే ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. జగన్‌కు తెలియకుండానే పోలీసులు చంద్రబాబును అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. జగన్ బయటకు వస్తే.. జనాలు తరిమికొట్టే పరిస్థితి నెలకొందని అన్నారు.