తమ అభ్యర్ధికి పడే ఓట్లపై టిడిపికి అనుమానం వచ్చినట్లుంది. నిరక్షరాస్యులు, అనారోగ్యపీడితులకు సహాయకులను తెచ్చుకోవచ్చు. ఆ ముసుగులో ఓటర్లతో సహాయకులు వెళ్ళి వారే ఓట్లు వేసేట్లుగా ప్లాన్ జరుగుతోందని ప్రచారం.

కడప జిల్లా అసలే వైఎస్ కుటుంబానికి కంచుకోట. పైగా పోటీలో ఉన్నది వైఎస్ వివేకానందరెడ్డి. ఇవతల అధికారంలో ఉన్నది చంద్రబాబునాయుడు. అసలే వైఎస్ కుటుంబమంటే ఏమాత్రం పడదు. ఇంకేముంది కంచుకోటను బద్దలుకొట్టాలని ప్రయత్నాలు మొదలయ్యాయి. అందుకే జిల్లా వ్యాప్తంగా అందరిలోనూ టెన్షన్ పెరిగిపోతోంది. వైసీపీ తరపున వివేకానందరెడ్డి, టిడిపి తరపున బిటెక్ రవినే అభ్యర్ధులైనా, పోటీ మాత్రం మాత్రం చంద్రబాబు-జగన్ మధ్యే అన్నట్లుంది జిల్లాలో.

మామూలుగా అయితే, వైసీపీని ఓడించటం టిడిపికి సాధ్యం కాదు. ఎందుకంటే జిల్లాలోని 845 ఓట్లలో వైసీపీకి 521, టిడిపికి 324 ఓట్లన్నాయి. కాబట్టే వైసీపీని ఎలా ఓడించాలన్నదే ఇపుడు ప్రధాన సమస్య టిడిపికి. అందుకే అవకాశమున్న మార్గాలన్నింటిలోనూ ప్రయత్నాలు చేస్తున్నారు. తన ఓట్లను కాపాడుకుంటూనే, ప్రత్యర్ధులను దెబ్బ కొట్టేందుకు ఇరు పార్టీలూ ఎత్తుకు ఫై ఎత్తులేస్తున్నాయి. ఇందులో భాగమే క్యాంపు రాజకీయాలు. అందుకోసం కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నారు. టిడిపి అయితే ప్రత్యర్ధి ఓటర్లను ప్రలోభాలకు గురిచేయటం కుదరకపోతే లాక్కోవాలని చూస్తున్నట్లు ఆరోపణలు వినబడుతున్నది.

ఇక క్యాంపులంటే చెప్పేదేముంది ఎంత ఖర్చో. దానికితోడు ఓట్లను కాపాడుకోవాలంటే ఏ పార్టీ అయినా సరే ఓటుకింత ఇచ్చుకోవాల్సిందే. లేకపోతే టిడిపి శిబిరం రెడీగా ఉంది బుట్టలో వేసుకోవటానికి. తన ఓట్లను కాపాడుకోవటానికి టిడిపి కూడా క్యాంపులు నడుపుతోందనుకోండి అది వేరే సంగతి. కాకపోతే, టిడిపి అధికారంలో ఉంది కాబట్టి ఎంతైనా చేయగలుగుతుంది. ఆ సౌలభ్యం వైసీపీకి లేదు కదా? తమ అభ్యర్ధికి పడే ఓట్లపై టిడిపికి అనుమానం వచ్చినట్లుంది. నిరక్షరాస్యులు, అనారోగ్యపీడితులకు సహాయకులను తెచ్చుకోవచ్చు. ఆ ముసుగులో ఓటర్లతో సహాయకులు వెళ్ళి వారే ఓట్లు వేసేట్లుగా ప్లాన్ జరుగుతోందని ప్రచారం.

పోలింగ్ తేదీ దగ్గర పడేకొద్దీ ఓటర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. ఓవైపు డిమాండ్ పెరిగేకొద్దీ ఇంకోవైపు జిల్లాలో బెట్టింగ్ ల జోరు ఆకాశాన్నంటుతోంది. ఎందుకంటే, అప్పుడప్పుడు కొందరు ఓటర్లు అటు ఇటు దూకుతుంటే జనాల్లో టెన్షన్ పెరిగిపోతోంది. దాంతో గెలుపెవరిది అనే విషయమై జిల్లా వ్యాప్తంగా పెద్ద చర్చ మొదలైంది. పోలింగ్ తేదీ దగ్గర పడేకొద్దీ చర్చ కాస్త పందాల్లోకి దిగింది. ఇపుడు జిల్లా వ్యాప్తంగా ఆ పందాలే వందల కోట్లకు చేరుకున్నట్లు సమాచారం. చూద్దాం ఇంక నాలుగు రోజులే కదా.