ఆంధ్రుల మనోభావాలను దెబ్బతీసిన బీజేపీకి వత్తాసు పలుకుతున్న వైసీపీకి తిరుపతి పార్లమెంట్‌ ఓటర్లు తగిన బుద్ధి చెప్పాలన్నారు తిరుపతి లోక్‌సభ టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి .

బుధవారం నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. 21 మంది వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌లో ఏరోజైనా రాష్ట్ర సమస్యల గురించి ప్రశ్నించారా అని పనబాక నిలదీశారు.

తిరుపతి ప్రచారంలో ప్రజలు తమ సమస్యలను ఏకరవు పెడుతున్నారని ఆమె చెప్పారు. గరుడవారధి, గూడూరు ఫ్లైఓవర్‌, నడికుడి రైల్వేలైన్‌ ఇలా ఏ ప్రాజెక్టు చూసినా అసంపూర్తిగానే ఉన్నాయని లక్ష్మీ మండిపడ్డారు.

నాలుగు సార్లు ఎంపీగా, రెండు సార్లు కేంద్రమంత్రిగా పని చేసిన తనకు మరో అవకాశం కల్పించాలని పనబాక లక్ష్మీ ఓటర్లను కోరారు. ఎంపీగా అవకాశం కల్పిస్తే తిరుపతి పవిత్రతను కాపాడేందుకు కృషి చేస్తానని పనబాక విజ్ఞప్తి చేశారు. కాగా, ఏప్రిల్ 17న తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ జరగనుండగా.. మే 2న ఓట్లను లెక్కించనున్నారు.