కుప్పంలో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.  స్థానిక నేతల పనితీరు కారణంగానే... కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు మోజార్టీ తగ్గిందని వారు ఆరోపిస్తున్నారు. స్థానిక నాయకులు సరిగా పనిచేసి ఉంటే... చంద్రబాబుకి ఇంత తక్కువ మెజార్టీ వచ్చేది కాదని వారు అభిప్రాయపడ్డారు.

ఈ క్రమంలో స్థానిక నేతల పై కోపాన్ని తమదైన శైలిలో తెలియజేశారు. కుప్పం ఆర్టీసీ బస్టాండు కూడలిలోని ఎన్టీఆర్‌ విగ్రహం వెనుకవైపున ఎన్నికలకు ముందు స్థానిక నాయకుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీ ఉంది. ఎన్నికల్లో చంద్రబాబు మెజారిటీ తగ్గిపోవడానికి స్థానిక నాయకులే కారణమనే కోపంతో ఉన్న కార్యకర్తల్లో కొందరు ఫ్లెక్సీని చించేశారు. 

విషయం తెలుసుకున్న నాయకులు వెంటనే అక్కడకి చేరుకున్నారు. కార్యకర్తలు చించేసిన బ్యానర్‌ను తొలగించి మరమ్మతు కోసం పంపించారు. ఇంతలో అక్కడికి చేరుకున్న కార్యకర్త ఒకరు నాయకులపై రెచ్చిపోయారు. చంద్రబాబుకు 75వేలకు పైగా మెజారిటీ తెప్పిస్తామని చెప్పిన మాటలు ఏమైయ్యాయని వారిని నిలదీశారు. కనీసమైన మెజారిటీ సాధించలేకపోవడం నాయకుల వైఫల్యమేనని ధ్వజమెత్తారు. 

ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని నాయకులకు బ్యానర్‌లలో తమ ఫొటోలు వేసుకునే అర్హత లేదని ధ్వజమెత్తారు. చివరకు కార్యకర్తల సన్నిహితులు కొందరు వారిని సమాధాన పరచారు. దీంతో వివాదం సద్దుమణిగింది.