చంద్రబాబుకు బెయిల్... ఏసిబి కోర్ట్ ప్రాంగణంలో లాయర్లకు లడ్డూలు తినిపించి టిడిపి సంబరాలు (వీడియో)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు బెయిల్ రావడంతో టిడిపి శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు.

విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు బెయిల్ లభించడంతో టిడిపి శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సిఐడి అధికారులు నంద్యాలలో అరెస్ట్ చేసింది మొదలు ఇప్పటివరకు చంద్రబాబు బయటకురావాలని టిడిపి నాయకులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో 53 రోజులు రిమాండ్ ఖైదీగా వున్న చంద్రబాబుకు తాజాగా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
చంద్రబాబుకు బెయిల్ వచ్చిందని తెలియడంతో విజయవాడలోని ఏసిబి కోర్టు వద్ద వున్న టిడిపి నాయకులు సంబరాలు జరిపారు. వెంటనే లడ్డూలు తీసుకువచ్చి కోర్టు ప్రాంగణంలో లాయర్ల, సిబ్బందికి పంచారు. తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఒకరికొకరు ఆలింగనం చేసుకున్నారు. టిడిపి నాయకుల సంబరాలతో ఏసిబి కోర్టు ప్రాంగణంలో సందడి నెలకొంది.
Read More జైల్లోంచి ఖైదీ బయటకు వస్తుంటే సంబరాలా..! : చంద్రబాబు విడుదలపై అంబటి సెటైర్లు
ఈ సందర్భంగా విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ టిడిపి ప్లోర్ లీడర్ రమణారావు మాట్లాడుతూ... చంద్రబాబు ని అరెస్ట్ చేసారని రోజా స్వీట్స్ పంచారని గుర్తుచేసారు. ఇవాళ చంద్రబాబు బెయిల్ పై బయటకి వస్తున్నారు...అందుకే మేము స్వీట్స్ పంచుకుంటున్నామని అన్నారు. ఇప్పుడు జగన్ కు చుక్కలు చూపిస్తామని రమణారావు అన్నారు.
వీడియో
చంద్రబాబును అన్యాయంగా జైల్లో పెట్టారని... ఇక వైసీపీ లీడర్లందరూ ఒక్కొక్కరుగా జైలుకి వెళ్ళడానికి రెడీగా వుండాలన్నారు. అంబటి రాంబాబు, రోజా , సజ్జల రామకృష్ణారెడ్డి , కొడాలి నాని లతో పాటు మిగిలిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు జైలుకి వెళ్లడం ఖాయమని రమణారావు అన్నారు.
అధికారం చేతిలో వుందికదా అని సీఎం జగన్ ప్రతిపక్ష నాయకుడిపై కక్షసాధింపుకు పాల్పడ్డాడని... కుట్రలు పన్ని జైలుకు పంపాడని అన్నారు. ఇప్పుడు న్యాయం గెలిచి బెయిల్ వచ్చిందని... సుప్రీంకోర్టులోనూ చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తుందని రమణారావు ధీమా వ్యక్తం చేసారు.