శ్రీకాకుళం జిల్లాలో వైసిపి నేతల ఒత్తిడితో పోలీసులు వేధించడంతోనే టిడిపి కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాాడని... ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని అచ్చెన్నాయుడు ఆరోపించారు. 

శ్రీకాకుళం: ప్రతిపక్ష టిడిపి (TDP) కార్యకర్త బలవన్మరణానికి పాల్పడి ప్రాణాలు కోల్పోయిన విషాదం శ్రీకాకుళం జిల్లా (srikakulam district)లో చోటుచేసుకుంది. అతడి ఆత్మహత్యకు వైసిపి నాయకుల ఒత్తిడితో పోలీసులు వేధింపులకు పాల్పడటమేనని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు (chandrababu naidu), జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (nara lokesh) స్పందించగా తాజాగా ఏపీ టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు (atchannaidu) కూడా సీరియస్ అయ్యారు. 

''రాష్ట్రంలో జగన్ రెడ్డి (ys jagan) ప్రభుత్వ వైఫల్యాలపై, దోపిడీ విధానాలుపై సోషల్ మీడియా సాక్షిగా గళమెత్తిన టిడిపి సోషల్ మీడియా కార్యకర్త కోన వెంకట్రావును వైసిపి గూండాలు పొట్టనబెట్టుకోవడం జగన్ రెడ్డి ప్రభుత్వ హత్యాకాండకు నిదర్శనం. వెంకట్రావు మృతి ముమ్మాటికీ వైసిపి నాయకుల హత్యే'' అని అచ్చెన్న పేర్కొన్నారు. 

''శ్రీకాకుళం జిల్లా మందస మండలం పోతంగి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్త వెంకట్రావును వేధింపులకు గురిచేసి ఆత్మహత్యలకు పురిగొల్పిన వైసిపి (ysrcp) ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (duvvada srinivas), వైసిపి గూండాలపై పోలీసులు తక్షణమే హత్యకేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (international womens day) రోజున శ్రీకాకుళం జిల్లాలో ఒక మహిళ మంగళసూత్రాన్ని అధికార పార్టీ గూండాలు తెంపేశారు'' అంటూ ఆందోళన వ్యక్తం చేసారు. 

''పోలీసులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గూండాలకు మాత్రమే రక్షకులుగా మారారు. టిడిపి కార్యకర్తలను పొట్టనబెట్టుకున్న ప్రతి వైఎస్సార్ సిపి నేత రాబోయే రోజుల్లో తగు మూల్యం చెల్లించుకోక తప్పదు. కోన వెంకట్రావు మృతికి తెలుగుదేశం పార్టీ తరపున సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఆయన కుటుంబసభ్యులకు మా ప్రగాడ సానుభూతి. వెంకట్రావు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్నివిధాలా అండగా నిలుస్తుంది'' అని అచ్చెన్నాయుడు వెల్లడించారు. 

ఇక టిడిపి అధినేత చంద్రబాబు కూడా వెంకట్రావు ఆత్మహత్యపై స్పందించారు. తెలుగుదేశం కార్యకర్త కోన వెంకట్రావుది ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యేనని ఆయన ఆరోపించారు. సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకే వేధించి ప్రాణాలు తీశారన్నారు. వెంకట్రావు మృతికి కారణం అయిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, పోలీసులపైన కేసు నమోదు చెయ్యాలని డిమాండ్ చేసారు. వెంకట్రావు మృతితో తీవ్ర విషాదంలో ఉన్న ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు చంద్రబాబు.

అయితే టిడిపి కార్యకర్త ఆత్మహత్య ఘటనపై నారా లోకేష్ సీరియస్ అయ్యారు. ఏపీలో ఉన్నది పోలీసులా? వైసీపీ రౌడీషీటర్లకి అనుచరులా? అనే అనుమానాలు కలుగుతున్నాయని మండిపడ్డారు. తన భావవ్యక్తికరణ స్వేచ్చకు లోబడి కేవలం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడమే కోన వెంకటరావు చేసిన నేరమా? అని లోకేష్ నిలదీసారు. 

''టీడీపీ కార్యకర్త వెంకటరావుని వేధించి బలవన్మరణానికి పాల్పడేలా చేసిన వైసీపీ దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రభుత్వ వైఫల్యాలు, వైసీపీ అవినీతి, అక్రమాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని ఇలా చంపుకుంటూపోతే రాష్ట్రంలో వైసీపీ నేతలు-పోలీసులు మాత్రమే మిగులుతారు'' అని లోకేష్ అన్నారు. 

''మా టిడిపి కార్యకర్త కోన వెంకటరావు మృతికి కారణమైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, బాధ్యులైన పోలీసులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. వెంకటరావు కుటుంబానికి తెలుగు దేశం పార్టీ అన్ని విధాలా అండగా వుంటుంది. సోషల్ మీడియా పోస్ట్ ల పేరుతో టిడిపి కార్యకర్తలపై ఇకనైనా వేధింపులు ఆపాలి. చట్టాలని గౌరవిస్తున్నామని ...పోలీసుల్ని అడ్డుపెట్టుకుని అరాచకాలకి తెగబడితే తిరుగుబాటు తప్పదు'' అని లోకేష్ హెచ్చరించారు.