Asianet News TeluguAsianet News Telugu

టిడిపిలో తిరిగితే చంపేస్తామని వైసిపి బెదిరింపులు... జూ.ఎన్టీఆర్ వీరాభిమాని సెల్ఫీ సూసైడ్ (వీడియో)

టిడిపిలో తిరిగితే చంపేస్తామని వైసిపి నేతలు బెదిరించడంతో ఆందోళనకు గురయిన ఓ యువకుడు సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో పెట్టి సూసైడ్ చేసుకున్నాడు. 

TDP Supporter selfie suicide in NTR District AKP
Author
First Published Jun 7, 2023, 1:28 PM IST

నందిగామ :అధికార వైసిపి నాయకుల వేధింపులు భరించలేకపోతున్నానంటూ ఓ యువకుడు సెల్పీ వీడియో తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడిననే తనను వైసిపి నాయకులు వేధిస్తున్నారని యువకుడు ఆవేదన వ్యక్తం చేసాడు. పోలీసులు సైతం అధికార పార్టీ నాయకుల మాటవిని రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని తననే బెదిరించారని... స్థానిక టిడిపి నాయకులకు ఈ విషయం చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయాడు. దీంతో ఏ దిక్కు లేక ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ  సెల్ఫీ వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పెట్టిన యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. 

బాధిత యవకుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం కాండ్రపాడు గ్రామానికి చెందిన అవినాష్ రెడ్డి(20) తెలుగుదేశం పార్టీ కార్యకర్త. అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని. టిడిపి ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా పాల్గొనడమే కాదు గ్రామంలో సొంత డబ్బులతో బ్యానర్లు ఏర్పాటుచేసేవాడు. ఇలా ఇటీవల శ్రీరామ నవమి సందర్భంగా బ్యానర్లు ఏర్పాటుచేసాడు. దీంతో స్థానిక వైసిపి నాయకుడు కొండా కృష్ణారెడ్డి ఆ బ్యానర్లు తొలగించాలని అనుచరుల చేత బెదిరించాడని అవినాష్ తెలిపాడు. రాత్రి తాను కట్టిన బ్యానర్లను తెల్లవారుజామున తీయించాడని అతడు తెలిపాడు. 

వైసిపి నాయకుల బెదిరింపులకు భయపడకుండా ఇటీవల ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మళ్ళీ బ్యానర్లు కట్టాడు అవినాష్ రెడ్డి. అలాగే మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న అతడు అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో చిర్రెత్తిపోయిన వైసిపి నాయకులు ఇటీవల తన అంతు చూస్తానని బెదిరించారని అవినాష్ వాపోయాడు. అంతేకాదు పొలంపనులు చేసుకుంటుండగా తనతో పాటు బావను కొట్టారని ఆరోపించాడు. టిడిపిలో తిరిగితే చంపేస్తామని బెదిరించారంటూ ఆందోళన వ్యక్తం చేసాడు.

వీడియో

తనపై జరిగిన దాడి, బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకుండా తిరిగి తననే బెదిరించారని అవినాష్ తెలిపాడు. వైసిపి నాయకుల ఫిర్యాదుమేరకు తనపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెడతామని... రౌడీ షీట్ ఓపెన్ చేసి జైల్లోకి తోస్తామని బెదిరించారని తెలిపాడు. ఇలా తనపై జరుగుతున్న దాడులు, వేధింపుల గురించి స్థానిక టిడిపి నాయకులకు చెప్పినా పట్టించుకోలేదని వాపోయాడు. అందువల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానని అంటూ అవినాష్ రెడ్డి పురుగులు మందు తాగాడు. 

ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన వీడియోను అవినాష్ రెడ్డి సోషల్ మీడియాలో పెట్టడంతో స్నేహితులు గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. వెంటనే అతడిని నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

(జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 )  కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.)
 

Follow Us:
Download App:
  • android
  • ios