మేం వదిలేసిన ఎన్నికల్లో గెలిచామని కేకలేయడమేంటి? వైసీపీపై టీడీపీ స్ట్రాటజీ కమిటీ విమర్శలు
పరిషత్ ఎన్నికలను టీడీపీ బహిష్కరించిందని, ఆ ఎన్నికల్లో తామే గెలిచామని వైసీపీ చంకలు గుద్దుకోవడం పిచ్చికి పరాకాష్ట అని టీడీపీ విమర్శలు చేసింది. జగన్ రెడ్డి నిజంగా రాష్ట్ర ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవాలనుకుంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరింది. జగన్ హయాంలో రాష్ట్రంలో మాదకద్రవ్యాలు, గంజాయి, నాసిరకం మద్యం, ఎర్రచందనం అక్రమ రవాణా ఇతర కార్యకలాపాలు పెరిగాయని చంద్రబాబు సారథ్యంలో జరిగిన టీడీపీ స్ట్రాటజీ కమిటీ పేర్కొంది.
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు అధ్యక్షతన పార్టీ స్ట్రాటజీ కమిటీ సమవేశమైంది. ఇందులో రాష్ట్రంలోని ప్రధాన సమస్యలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇదే సమావేశంలో పరిషత్ ఎన్నికలను ప్రస్తావించింది. టీడీపీ బహిష్కరించిన పరిషత్ ఎన్నికల్లో గెలిచామని చంకలు గుద్దుకోవడం జగన్ రెడ్డి పిచ్చికి పరాకాష్ట అని విమర్శలు చేసింది. అందులోనూ పోలీసులతో బలవంతపు ఏకగ్రీవాలు చేయించిందని, ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని ఆరోపించింది. జగన్ రెడ్డి నిజంగా ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవాలంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరింది.
గుజరాత్‌ల రూ. 72వేల కోట్ల విలువైన హెరాయిన్ పట్టుబడిందని, ఆఫ్ఘనిస్తాన్ స్మగ్లర్లకు తాడేపల్లితో లింక్ లేకపోతే అంతపెద్ద మొత్తంలో డ్రగ్స్ ఏపీకి ఎలా తరలించే ప్రయత్నం చేస్తారని అనుమానం వ్యక్తం చేసింది. జగన్ ప్రభుత్వ వచ్చాకే డ్రగ్స్ తరలించిన కంపెనీ విజయవాడలో నమోదైందని పేర్కొంది. జగన్ హయాంలో గంజాయి స్మగ్లింగ్ పెరిగిపోవడం, నాసిరకం మద్యం పంపిణీ, ఎర్రచందనం అక్రమ రవాణా పెరిగిపోయాయని ఆరోపించింది. తిరుమల శ్రీవారికి చెందిన తలనీలాలు చైనాకు తరలిస్తుండగా పట్టుబడ్డాయని, అవినీతి, వైన్, మైన్, శాండ్ మాఫియాను పరాకాష్టకు చేరాయని తెలిపింది. జగన్ రెడ్డి పాలన గూండా రాజ్యంగా మారిందని ఆరోపించింది. చంద్రబాబు నాయుడి ఇంటిపై, జోగి రమేశ్ సారథ్యంలో దాడి చేశారని, బాధితులపైనే అక్రమ కేసులు పెట్టారని పేర్కొంది. సహకరించిన డీజీపనీ రీకాల్ చేయడానికి కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది.
ఫైబర్ నెట్ ఈడీగా సీఎం స్వయంగా సంతకం పెట్టి ఎలాంటి అర్హతలేని గౌరీ శంకర్‌ను నియమించారని కమిటీ ఆరోపించింది. అన్నదాతలకు అండగా సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చిన ఈ నెల 27న భారత్ బంద్‌కు సంఘీభావం తెలియజేసింది. టీటీడీ జంబో బోర్డును ఏర్పాటు చేసి అందులో నేరాలు చేసినవారిని చేర్చి తిరుమల పవిత్రతను మంటకలిపారని మండిపడింది.
బడుగు బలహీనవర్గాలకు కేంద్రం ఇచ్చే నిధులకే జగన్ ప్రభుత్వం అందుకు సరిపడా నిదులు ఇవ్వడం లేదని పేర్కొంది. కార్మికుల బీమా సొమ్ము వెయ్యికోట్లనూ సొంత అవసరాలకు సీఎం వాడేశారని ఆరోపించింది. జగన్ రెడ్డి ప్రభుత్వం సెటిల్‌మెంట్ల ప్రభుత్వంగా మారిందని పేర్కొంది. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం గనుక గృహ రుణాలను పూర్తిగా రద్దు చేస్తుందని, ఎవరూ డబ్బు కట్టాల్సిన అవసరం లేదని తెలిపింది. అమరావతి దళిత జేఏసీ పులి చిన్నాపై వైసీపీ నేతల దాడిని ఖండించింది.
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి అవసరమైన పరిస్థితులు నెలకొన్నాయని కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సమావేశంలో టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వర్ల రామయ్య, దూళిపాళ్ల నరేంద్ర, బండారు సత్యనారాయణ మూర్తి, దేవినేని ఉమామహేశ్వరరావు, పయ్యావుల కేశవ్, నిమ్మకాలయ చినరాజప్ప, బోండా ఉమామహేశ్వరరావు, అశోక్ బాబు, టీడీ జనార్ధన్, బీద రవిచంద్ర యాదవ్, నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి, బీసీ జనార్ధన్ రెడ్డి, మద్దిపాటి వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు.