గుంటూరు: స్వయం ప్రతిపత్తి గల ఎన్నికల సంఘం నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించడం ఎన్నికల చట్టాలను కాలరాయడమేనని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ఎస్‌ఈసికి రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ రాజ్యాంగ వ్యతిరేకమని... ఆర్టికల్ 243K, 243Z(A)  లను ఉల్లంఘించడమేనని అన్నారు. నిష్ఫాక్షికంగా ఎన్నికలు జరిగితే స్థానిక సంస్థల్లో గెలవలేమనేదే జగన్ రెడ్డి భయమని యనమల పేర్కొన్నారు.
 
''ఎన్నికలను వాయిదా వేసే అధికారం, మళ్లీ నిర్వహించే అధికారం ఎన్నికల సంఘానిదే అని కోర్టులు చాలా స్పష్టంగా చెప్పాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని కోర్టులు చెప్పాయే తప్ప, రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందే ఈసి చేయాలని ఎక్కడా లేదు. కన్సల్ట్ చేయడం వేరు, కన్సెంట్ తీసుకోవడం వేరు. తమను కన్సల్ట్ చేయడమే కాదు, తమ కన్సెంట్ తీసుకునే ఎన్నికలు జరపాలన్న వైసిపి వితండవాదన విడ్డూరంగా ఉంది. ఇటువంటి పెడ ముఖ్యమంత్రిని, వింత పార్టీని, వితండ ప్రభుత్వాన్ని దేశం చూడలేదు'' అన్నారు. 

''న్యాయస్థానాల ఆదేశాలను కూడా సిఎం జగన్ రెడ్డి అమలు చేయరు. స్వయం ప్రతిపత్తితో ఎన్నికల సంఘాన్ని పని చేయనీయరు. కోర్టులతో, రాజ్యాంగ సంస్థలతో జగన్మోహన్ రెడ్డి గేమ్స్ ఆడుతున్నారు. ప్రజా సమస్యలపై ఆందోళనలు చేసేవాళ్లపై కేసులు పెట్టడం, పోలీసు బలాలతో అణిచివేయడం, ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెట్టడం, జగన్ పాలనలో నెపోటిజం, ఫేవరిటిజం తప్ప మరేమీ లేదు. ఈ రెండు ఐపిసిలో చెప్పబడిన అవినీతి కిందకే వస్తాయి'' అనిపేర్కొన్నారు. 

''ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసి సంప్రదించారు. కాబట్టి తక్షణమే ఎన్నికల నిర్వహణకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. ఎప్పుడైనా ఎన్నికలు జరిపే అధికారం ఈసికి ఉంది. అమెరికాలో ట్రంప్ తరహాలోనే ఆంధ్రాలో జగన్ రెడ్డి వ్యవహారం ఉంది. అమెరికా రాజ్యాంగానికి విరుద్దంగా ట్రంప్ వ్యవహరిస్తున్నట్లే జగన్మోహన్ రెడ్డి కూడా భారత రాజ్యాంగానికి విరుద్దంగా ప్రవర్తిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ఎన్నికయ్యాడని ప్రపంచం అంతా ఆమోదిస్తే, నేను మాత్రం కుర్చీ దిగను అన్న ట్రంప్ శైలిలోనే జగన్మోహన్ రెడ్డి వ్యవహారం ఉంది'' అని ఎద్దేవా చేశారు. 

''ఎన్నికలు పెట్టడానికి వీల్లేదని చెప్పే అధికారం సిఎస్ కు ఎక్కడ ఉంది..? ఏ అధికారంతో సిఎస్ ఎన్నికల సంఘాన్ని ధిక్కరిస్తున్నారు..?ఎన్నికల నిర్వహణకు ఈసికి సర్వాధికారాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి, గవర్నర్ కు తెలియజేసి ఎప్పుడైనా ఎన్నికలను ఈసి పెట్టవచ్చు. సిఎం జగన్ కు తగ్గట్లుగానే సిఎస్ వ్యవహార శైలి కూడా ఉంది. వీడియో కాన్ఫరెన్స్ లు పెట్టడానికి కూడా ఈసికి అభ్యంతరాలు చెప్పడం రాజ్యాంగాన్ని అవమానించడమే'' అని మండిపడ్డారు. 

''ఎస్ఈసికి వీడియో కాన్ఫరెన్స్ లు కూడా పెట్టుకునే పరిస్థితులు లేకుండా చేయడం దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఉందా..? రెండుసార్లు వీడియో కాన్ఫరెన్స్ లకు అడ్డం పడటం సిఎస్ కు తగనిపని. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి సిఎంకు గాని, సిఎస్ కు గాని అధికారం లేదు. లేని అధికారాన్ని చలాయించాలని చూస్తే అది రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే'' అని అన్నారు. 

''ప్రస్తుత ఈసి హయాంలో నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగితే వైసిపి అక్రమదందాలకు ఆస్కారం ఉండదని, కండబలంతో గెలుపొందలేమనే భయంతోనే జగన్మోహన్ రెడ్డి కాలం గడిపేస్తున్నారు. ఎస్ఈసితో భేటిలో గవర్నర్ కూడా పాజిటివ్ గా స్పందించి ఆర్టికల్ 243K(3) ప్రకారం చర్యలు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి సరైన దిశానిర్దేశం చేయాల్సింది.
 గతంలో జరిగిన బలవంతపు ఏకగ్రీవాలు రద్దు చేసి మళ్లీ అన్నింటికి ఎన్నికలు జరపాలి. మధ్యలో ఆపేసిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలి'' అని యనమల డిమాండ్ చేశారు.