చంద్రబాబునాయుడు ఎత్తులు పారలేదు

చంద్రబాబునాయుడు ఎత్తులు పారలేదు. టిడిపిలోని సీనియర్ నేత, విజయవాడ తూర్పు నియోజకవర్గం మాజీ ఎంఎల్ఏ యలమంచిలి రవి జగన్ తో భేటీ అవుతున్నారు. ఏప్రిల్ 10వ తేదీన జగన్ సమక్షంలో రవి వైసిపిలో చేరాలని గతంలో నిర్ణయించుకున్న విషయం అందరికీ తెలిసిందే.

అయితే, టిడిపి నేతలు అప్రమత్తమై రవిని బుజ్జగించారు. వెంటనే చంద్రబాబుతో భేటీ ఏర్పాటు చేశారు. దాంతో వారిద్దరి మధ్యా ఏం జరిగిందో తెలీదు కానీ తాను టిడిపిలోనే ఉంటానంటూ మీడియా ముందు రవి ఓ ప్రకటన చేశారు.

ఇంతలో పార్టీలో మళ్ళీ ఏం జరిగిందో తెలీదు. సోమవారం గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో పాదయాత్రలో ఉన్నజగన్ తో రవి భేటీ అవటానికి నిర్ణయించుకున్నారు. అదే విషయాన్ని జగన్ కు కబురు పంపారు.

వెంటనే జగన్ దగ్గర నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దాంతో జగన్ పాదయాత్ర ముగించి విశ్రాంతి తీసుకుంటున్న ప్రాంతానికి రవి చేరుకున్నారు. మరి కాసేపట్లో జగన్- రవి మధ్య భేటీ జరుగనున్నది. తర్వాత రవి మీడియాతో మాట్లాడుతారని సమాచారం.