న్యూడిల్లీ: ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీకి పరాభవాలు తప్పడంలేదు. అయితే కేవలం రాష్ట్రంలోనే  టిడిపి పరిస్థితి అద్వాన్నంగా మారడం కాదు డిల్లీలనూ ఆ పార్టీ ప్రాభవం తగ్గింది. గతంలో ఎన్డీఏ మిత్రపక్షంగా  వున్న సమక్షంలో సకల మర్యాదలు పొందిన పార్లమెంట్ భవనంలోనే టిడిపి ఇప్పుడు అవమానాలు ఎదుర్కుంటోంది. 

అసలు విషయం ఏంటంటే... పార్లమెంట్ భవనంలో గత 30ఏళ్లుగా టిడిపి ఒకే కార్యాలయంలో కొనసాగుతోంది. గ్రౌండ్ ప్లోర్ లోని ఐదవ నంబర్ గదిలోనే ఈ పార్టీ కార్యాలయం కొనసాగుతూ వస్తోంది. ఈ గ్రౌండ్ ప్లోర్ లోనే ప్రధాని, హోంమంత్రి కార్యాలయాలుకూడా వుండటంతో కీలకమైన పార్టీలకే ఇక్కడ కార్యాలయాన్ని కేటాయిస్తారు. ఇలా గతంలో కీలక పార్టీగా కొనసాగిన టిడిపి కార్యాలయం కూడా ఇక్కడే వుండేది. 

అయితే గత స్వార్వత్రికి ఎన్నికల్లో టిడిపి కేవలం మూడు ఎంపీ స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 22 ఎంపీలను గెలుచుకుని సత్తా చాటింది. ఇలా ఎక్కువమంది ఎంపీలను  కలిగి కీలకంగా మారిన వైసిపి పార్టీకి గతంలో టిడిపి కేటాయించిన కార్యాలయన్నే కేటాయించారు. టిడిపి కి మూడో అంతస్తులో 118వ నెంబర్ గదిని కేటాయించారు. 

కానీ టిడిపి మాత్రం కార్యాలయాన్ని మార్చలేదు. దీంతో ప్రస్తుతం బడ్జెట్ సమావేశాల సందర్భంగా స్పీకర్ ఓంబిర్లాను కలిసిన వైసిపి ఎంపీలు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన స్పీకర్ పార్లమెంట్ సిబ్బందికి వెంటనే  ఆ కార్యాలయాన్ని ఖాళీ చేయించాల్సిందిగా సూచించారు. దీంతో  ఐదవ నెంబర్ గది వద్ద టిడిపి కార్యాలయ బోర్డును తొలగించి వైఎస్సార్‌సీపీ కార్యాలయంగా మార్చారు.