అమరావతి: తిరుపతిలో సెటిలయ్యేందుకు ఎవరొస్తారంటూ గతంలో వైఎస్ జగన్ వ్యాఖ్యానించారంటూ టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. తిరుపతి ఎవొరస్తారని అంటున్నారంటే మీకు శ్రీవారిపై విశ్వాసం లేనట్టేగా? అని నారా లోకేశ్ ప్రశ్నించారు. కోనేటిరాయుడి సన్నిధికి ఎవరొస్తారనేంత గర్వం జగన్ రెడ్డికి ఎక్కడి నుంచి వచ్చింది? అని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. వెంకన్న స్వామిపై విశ్వాసం ఉంచి ప్రపంచమంతా తిరుపతి వస్తుంటే జగన్ వ్యాఖ్యలు సరికాదని లోకేశ్ చెప్పారు.

 కుల, మత, ప్రాంత భేదాల్లేకుండా... పేద, ధనిక అనే తేడాలు చూపని శ్రీవారిపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ తిరుపతికి శతాబ్దాలుగా వస్తూనే ఉన్నారని ఆయన  అన్నారు. అలాంటి తిరుపతికి ఎవరూ రారని అంటున్నారంటే ఏడుకొండలవాడిపై విశ్వాసం లేదని జగన్ రెడ్డి ఒప్పుకుంటున్నట్టే కదా! అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు జగన్ వ్యాఖ్యల వీడియోను కూడా పంచుకున్నారు.