అమరావతి: ఏపీలో రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరు మినహా అందరూ ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొన్నారు. వైసీపీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు.

టీడీపీలో రెబెల్స్ గా ఉన్న వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాంలు పోలింగ్ ముగియడానికి చివరి నిమిషంలో ఓటు వేశారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు టీడీపీ విప్ జారీ చేసింది.

ఇవాళ ఉదయం నుండి పోలింగ్ స్టేషన్ వద్దే ఉన్న మద్దాలి గిరి, వల్లభనేని వంశీలు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి తిరిగారు. ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డితో కలిసి కరణం బలరాం పోలింగ్ స్టేషన్ కు వచ్చారు.  ఈ ముగ్గురు పోలింగ్ ముగియడానికి ముందుగా ఓటు వేశారు. 

also read:ఏపీలో రాజ్యసభ ఎన్నికల్లో 92 శాతం పోలింగ్: ఓటింగ్‌కు టీడీపీ ఎమ్మెల్యే అనగాని దూరం

ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఏ పార్టీకి ఓటు చేశారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఓటు వేసిన  తర్వాత టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు మద్దాలి గిరి, వల్లభనేని వంశీలు మీడియాతో మాట్లాడారు. 

తనకు పార్టీ విప్ అందలేదని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి చెప్పారు. అయినా కూడ పార్టీ చెప్పిన ప్రకారంగానే తాను ఓటు చేసినట్టుగా గిరి ప్రకటించారు. మరో వైపు తాను ఎవరికి ఓటేశానో రాజా అన్ని కొద్దిసేపట్లో చెబుతారు కదా అంటూ మీడియా ప్రతినిధులకు నవ్వుతూ  వల్లభనేని వంశీ చెప్పారు.