అమరావతి: రాజ్యసభ ఎన్నికల సమయంలో టీడీపీకి రేపల్లే ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ షాకిచ్చారు. హోం క్వారంటైన్‌లో ఉన్నందున ఓటింగ్ కు దూరంగా ఉండాల్సి వచ్చిందని ఆయన చంద్రబాబుకు లేఖ రాశారు.

టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతుగా నిలిచారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిలు వైసీపీకి మద్దతు ప్రకటించారు.

రేపల్లే ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మాత్రం ఓటింగ్ కు దూరంగా ఉంటున్నట్టుగా చంద్రబాబుకు లేఖ రాశాడు. తాను ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని కలిసినట్టుగా చెప్పారు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా సోకిన విషయం తెలిసిందే. డాక్టర్ల సూచన మేరకు తాను హోం క్వారంటైన్‌లో ఉన్నట్టుగా ఆయన చెప్పారు. 

ఈ కారణంగానే తాను రాజ్యసభ ఎన్నికల్లో ఓటింగ్ కు దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు.  పార్టీకి వీర విధేయుడిగా ఉంటున్న తాను ఈ ఎన్నికలకు దూరంగా ఉండడం చాలా బాధాకరంగా ఉందన్నారు. పార్టీకి అవసరమైన సమయంలో ఎళ్లవేళలా ముందుంటామని ఆయన  ఆ లేఖలో పేర్కొన్నారు.

రాజ్యసభ ఎన్నికల్లో ఇప్పటివరకు 92 శాతం పోలింగ్ పూర్తైంది. ఇప్పటివరకు 168 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. వైసీపీ నుండి 149 మంది ఓటు హక్కును వినియోగించుకొన్నారు. ఉండవల్లి శ్రీదేవి, కోన రఘుపతి ఓటు హక్కును వినియోగించుకోలేదు.  

ఇక టీడీపీ ఎమ్మెల్యేలు మద్దాలి గిరి, వల్లభనేని వంశీలు పోలింగ్ స్టేషన్ కు వచ్చినా కూడ ఓటు హక్కును వినియోగించుకోలేదు. కరణం బలరాం పోలింగ్ స్టేషన్ కు రాలేదు. అనారోగ్య కారణాలతో అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్ లు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు.