తెలుగుదేశం పార్టీ రాజ్యసభా పక్షం బీజేపీలో అధికారికంగా విలీనమైంది. తమను బీజేపీలో విలీనం చేయాలంటూ మెజారిటీ టీడీపీ సభ్యులు రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యకు వారు లేఖ రాశారు.

రాజ్యాంగంలోని షెడ్యూల్ పది అనుసరించి విలీనాన్ని గుర్తించాల్సిందిగా టీడీపీ ఎంపీలు లేఖలో పేర్కొన్నారు. అంతకు ముందు ఎంపీలు సమావేశమై బీజేపీలో విలీనానికి సంబంధించిన తీర్మానాన్ని చేశారు.

మోడీ నాయకత్వం,  అభివృద్ధిని చూసి తాము బీజేపీలో చేరాలనుకుంటున్నట్లు వారు తీర్మానంలో పేర్కొన్నారు. అనంతరం బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో టీడీపీ ఎంపీలు బీజేపీలోకి చేరారు.

పార్టీ కండువా కప్పిన నడ్డా వారిని బీజేపీలోకి ఆహ్వానించారు. అనంతరం నడ్డా మాట్లాడుతూ.. మోడీ నాయకత్వాన్ని విశ్వసించి టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారని, వీరి రాకను స్వాగతిస్తున్నామని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఎంపీలు బీజేపీలో చేరుతున్నారని, నలుగురు ఎంపీలు ఇప్పటి నుంచి బీజేపీ సభ్యులుగా ఉంటారని నడ్డా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ.. దేశ ప్రజల అభీష్టం బీజేపీవైపే ఉందని, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే చేరామన్నారు.