అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై నిప్పులు చెరిగారు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఎంతో కష్టపడి ఎన్నో సంప్రదింపులు చేసి లులు గ్రూప్ ను పెట్టుబడి పెట్టేందుకు ఒప్పించామని చెప్పుకొచ్చారు. 

లూలూ గ్రూప్ భవిష్యత్ లో ఏపీలో పెట్టుబడులు పెట్టదంటూ వస్తున్న వార్తలపై చంద్రబాబు స్పందించారు. ఎన్నో సంప్రదింపులు జరిపి, నిరంతరం వెంటపడి లులు గ్రూప్‌ను పెట్టుబడి పెట్టేందుకు ఒప్పించామని గుర్తు చేశారు. 

ఈ ప్రాజెక్టుతో విశాఖలో వేల ఉద్యోగాలు వచ్చేవని స్థానికంగా ఆర్థిక అభివృద్ధి కూడా జరిగేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. జగన్ ప్రభుత్వం తెలివితక్కువ నిర్ణయాల వల్ల తమ శ్రమ అంతా వృథా అయ్యిందన్నారు చంద్రబాబు.  

బాధ్యత లేని ఇలాంటి చర్యలు వ్యాపార అనుకూల వాతావరణాన్ని దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తాయంటూ మండిపడ్డారు. లులు గ్రూప్‌కి ఇలా జరిగినందుకు ఏపీ ప్రజలు, విశాఖవాసుల తరపున తాను విచారం వ్యక్తం చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. 

ఇకపోతే లూలూ గ్రూప్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా లేదంటూ వస్తున్న వార్తలను పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఖండించారు. గత ప్రభుత్వంలో జరిగిన ఒప్పందాల ప్రకారం విశాఖపట్నంలో కన్వెన్షన్ సెంటర్, ఫైవ్ స్టార్ హోటళ్లపై పెట్టుబడులు పెట్టేందుకు లూలూ గ్రూప్ ముందుకు వచ్చిందన్నారు. 

అందులో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం 2018 ఫిబ్రవరిలో ఒప్పందం కుదుర్చుకుని లూలూ కంపెనీకి 13.83 ఎకరాల భూమిని కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఆ భూమి కేసుల్లో ఉందని,  న్యాయపరమైన చిక్కులున్న భూమిని అప్పగించడంపై  నాటి ఏపీఐఐసీ ఎండీ రాసిన లేఖను గురించి మంత్రి ప్రస్తావించారు. 

సీఎం జగన్ ఆదేశాల మేరకు తాము మొదటి నుంచి చెప్తున్నట్లు పారదర్శక పాలనకే పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని ప్రచారాలు, కథనాలు రాసినా అబద్ధాలు నిజం కాబోవన్నారు మంత్రి గౌతమ్ రెడ్డి.  

తప్పును తప్పని చెప్పకుండా అదే తప్పుదారిలో వెళ్లడం సరైంది కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలోని ఇష్టారీతిన జరిగిన లోపాయికారి ఒప్పందాలను నేరుగా ప్రజలముందుంచడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.  

లూలూ ప్రాజెక్టును ప్రభుత్వం రద్దు చేయడానికి రెండు ప్రధాన కారణాలున్నాయని మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. లూలూతో ప్రభుత్వం ప్రాజెక్టును రద్దు చేసుకోవడానికి బిడ్డింగ్ లో పారదర్శకత లేకపోవడం మొదటి కారణమన్నారు. 

లూలూకు కేటాయించిన బహిరంగ మార్కెట్ లో ఉన్న ధరతో పోలిస్తే, చాలా తక్కువ ధరకే అప్పగించడాన్ని ప్రజాధనం వృథా చేయడంగా భావించి లూలూతో రద్దు చేసుకున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. లూలూకు కేటాయించిన భూమికి బహిరంగ మార్కెట్ లో వాస్తవంగా ఉన్న అద్దె ధర కేటాయించిన ధరకు చాలా వ్యత్యాసం ఉందన్నారు.