అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వాలంటీర్ల వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. వాలంటీర్లు కూడా ఒక ఉద్యోగమేనా అంటూ ప్రశ్నించారు. 

వాలంటీర్ల వ్యవస్థ వల్ల ఎవరికి ఉపయోగమో చెప్పాలని చంద్రబాబు నిలదీశారు. వైసీపీ కార్యకర్తలకు వాలంటీర్ల ఉద్యోగం ఇవ్వాలని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. ప్రజలకు ఈ వ్యవస్థ వల్ల ఎలాంటి ఉపయోగం ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. 

లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేశామంటూ వైసీపీ ప్రభుత్వం హంగామా చేస్తుందని విమర్శించారు. గోనె సంచులు మోసే ఉద్యోగం, బియ్యం సంచులు మోయడం కూడా కూడా ఒక ఉద్యోగమేనా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

రూ.5వేల రూపాయలతో ఉద్యోగాలు అంటూ కథలు చెప్తారా అంటూ మండిపడ్డారు. వాలంటీర్లు తప్పుడు పనులు చేస్తారా అంటూ మండిపడ్డారు. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లి ఇబ్బందులకు గురి చేస్తారా అంటూ మండిపడ్డారు. 

వాలంటీర్లమని చెప్పుకుంటూ ప్రజలను డిస్టర్బ్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. పగటి పూట మగవాళ్లు ఉండని సమయంలో ఇంటికి వెళ్లి తలుపుకొడుతున్నారని ఆడవాళ్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలు చూస్తుంటే చాలా బాధేస్తుందన్నారు.  ఇంత నీచమైన విధానాలా అంటూ తిట్టిపోశారు. ఇలాంటి పనులను చూస్తుంటే ఆవేదన వస్తుందని అంతేకాకుండా కోపం కూడా వస్తుందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు.