అమరావతి: విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ మృతుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లేఖలు రాశారు. వ్యక్తిగతంగా ఒక్కో కుటుంబానికి లేఖ ఆయన లేఖ రాశారు. ఈ లేఖలను విశాఖ టీడీపీ నేతలు మృతుల కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా కలిసి అందిస్తారు.  

ఎల్జీ పాలిమర్స్ మృతుల కుటుంబాలకు సాంత్వనగా రూ.50 వేలు సాయం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ దుర్ఘటనలో నాగులపల్లి గ్రీష్మ మృతి చెందడం హృదయవిదారకమని ఆయన అన్నారు. స్టైరిన్ విష వాయువుల బారి నుంచి తప్పించుకోలేక  మొత్తం 15 మంది మృతి చెందడం తన మనసును కలచి వేసిందని చంద్రబాబు అన్నారు. 

వందలాది మంది అస్వస్తతకు గురై ఆసుపత్రులలో చేరి చికిత్స పొందడం చూసి చలించి పోయానని ఆయన చెప్పారు. తనకెంతో ఇష్టమైన విశాఖ నగరంలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ దుర్ఘటన చోటు చేసుకోవడం శోచనీయమని అన్నారు. ఆది నుంచి ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యాన్ని వైసీపీ ప్రభుత్వం వెనుకేసుకు రావడం విచారకరమని అన్నారు. 
     
వ్యక్తిగతంగా మిమ్మలను పరామర్శించి ఆర్ధిక సాయం అందించాలని అనుకుంటే వైసీపీ ప్రభుత్వం సహకరించలేదని చెప్పారు. తాను విశాఖ బయలుదేరిన రోజు విమాన సర్వీసును ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందేనని ఆయన గుర్తు చేశారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా రాష్ట్ర ప్రజల కష్టనష్టాల్లో తెలుగుదేశం పార్టీ అండగా ఉండటం తెలిసిందేనని కూడా ఆయన అన్నారు.  
   
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ బాధిత మృతుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ రూ.50 వేల ఆర్ధిక సహాయం అందిస్తున్నామని, ఆ మొత్తాన్ని మీ బ్యాంకు అక్కౌంటులో జమ చేస్తున్నామని తెలియజేస్తున్నానని ఆయన అన్నారు.. మీకు జరిగిన నష్టం ఎవరూ  ఏ విధంగా భర్తీ చేయలేనిదని, అయినా గుండె దిటవు చేసుకుని భవిష్యత్తు వైపు ముందడుగు వేయాలని కోరుకుంటున్నానని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ పూర్తీ సహాయసహకారాలు అందజేస్తానని ఆయన అన్నారు.