నెల్లూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ సీఎం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. నెల్లూరు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు వైసీపీ నేతలు ఉన్మాదంతో దాడులు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వైసీపీ ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. రెచ్చిపోతే తోకలు కత్తిరిస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్టులు, మహిళా అధికారులపై దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. 

వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నేరమయంగా మారిపోయిందన్నారు. వైసీపీలో చేరని వారిని హత్యలు చేస్తున్నారని లేకపోతే దాడులకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. బలహీన వర్గాలను వేధించడమే లక్ష్యంగా వైసీపీ పనిచేస్తోందని మండిపడ్డారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఏనాడూ చూడలేదన్నారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను సీఎం జగన్ అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. లేకపోతే తోకలు కత్తిరిస్తామని హెచ్చరించారు. పులివెందుల పంచాయితీలను ఇక్కడ చేస్తే సహించేది లేదన్నారు. 

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైనా, నాయకులపైనా దాడులు జరుగుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు. కొంతమంది పోలీసులు వైసీపీ ఎమ్మెల్యేలకు తొత్తులుగా మారారని చంద్రబాబు విమర్శించారు. వైసీపీ దాడులతో నష్టపోయిన వారికి నష్ట పరిహారం చెల్లించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలానే వ్యవహరిస్తే వైసీపీ నేతలు ఎక్కడో ఉండేవారని మండిపడ్డారు. దొంగసారా, బెట్టింగ్‌ కాసే వాళ్ళు ఎమ్మెల్యేలా?అంటూ చంద్రబాబు నిలదీశారు. కేసుల పేరుతో మహిళలను వేధిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. 

వైసీపీ ఎమ్మెల్యేకు పిచ్చి పట్టిందన్నారు. మహిళల జోలికివచ్చినా, మహిళా అధికారులను వేధించినా తాట తీస్తానని చంద్రబాబు హెచ్చరించారు. జగన్ జేఎస్టీని తలపిస్తూ లోకల్ ఎమ్మెల్యేలు లోకల్ టాక్స్‌కు తెరతీస్తున్నారంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.