అమరావతి: నదీజలాల విషయంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వాడీ వేడి చర్చ జరిగింది. గోదావరి నదీజలాల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సహకరిస్తున్నారంటూ ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

వ్యక్తులుగా కేసీఆర్, జగన్ లు కలిసి ఉండొచ్చని అలాగే కొన్ని సమస్యలకు తాత్కాలిక పరిష్కారా మార్గాలు చూపించుకోవచ్చునన్నారు. ఇరువురు తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో అన్న అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే బాగుంటుందని సూచించారు.  

తెలంగాణ సీఎం కేసీఆర్ తో తనకు సఖ్యత లేదని అధికార పార్టీ ఆరోపిస్తోందని దాన్ని సరిదిద్ది వారు సఖ్యతగా ఉంటున్నారంటూ వైసీపీ చెప్పడం ఆవిషయంలో అభినందనీయమేనన్నారు.  

కేసీఆర్ తో ఒకప్పుడు తాను కలిసి పనిచేశానని చెప్పుకొచ్చారు. అప్పట్లో తమకు ఎలాంటి ఇబ్బందులు రాలేదని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇకపోతే ప్రస్తుతం కేసీఆర్, జగన్ లు కలిసి ఉండొచ్చని అయితే భవిష్యత్ లో రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలగకుండా చూసుకోవాలన్నారు. 

పైన ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతున్నప్పుడు దిగువ ఉన్నవాళ్లు నిస్సహాయతతో చూస్తూ ఉండటంట తప్ప చేసేదేమీ లేదని అధికార పార్టీయే చెప్తోందని అలాంటప్పుడు దిగువ ఉన్న తమ రాష్ట్రం పరిస్థితేంటని ప్రశ్నించారు.  

ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని డాక్యుమెంటేషన్ రూపొందిస్తామని చెప్తున్నారని ఇప్పటికే గోదావరి ట్రిబ్యునల్ కు డాక్యుమెంటేషన్ లేదా అని ప్రశ్నించారు. కృష్ణా ట్రిబ్యునల్ డాక్యుమెంటేషన్ ఉందని అలాగే గోదావరి అథాటిరిటీ నియామకానికి కేంద్ర చట్టం ఉందన్నారు. 

కేవలం 15 టీఎంసీల నీటి కోసం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య ఇప్పటికే వివాదం కొనసాగుతూనే ఉందని సుప్రీం కోర్టు కూడా చేతులెత్తేసిన పరిస్థితి నెలకొందన్నారు. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని హితవు పలికారు.  

ఇరు రాష్ట్రాలకు సంబంధించి శ్రీశైలం, నాగార్జున సాగర్ వద్ద నీటి విషయంలో ఇరు రాష్ట్రాల పోలీసులు కొట్టుకునే పరిస్థితికి దిగజారిందని చెప్పుకొచ్చారు. పాకిస్థాన్-ఇండియా మాదిరిగా నీటి కోసం కొట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుందని తాను భావించానని చెప్పుకొచ్చారు. సమస్య పరిష్కారం కోసం గవర్నర్ ను కోరితే ఆఖరికి సమస్య ఒక పరిష్కారానికి వచ్చిందని చంద్రబాబు స్పష్టం చేశారు.